
సత్యదేవ్
‘జ్యోతిలక్ష్మి, ఘాజీ’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితా శ్వేత కథానాయిక. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పిళ్లై నిర్మించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ– ‘‘లారెన్స్ నటించిన తమిళ ‘శివలింగ’ చిత్రాన్ని తొలిసారి మా బ్యానర్‌లో తెలుగులో అనువదించి మంచి విజయం అందుకున్నాం.
2014లో తమిళంలో ఘన విజయం సాధించిన ‘చతురంగ వేటై్ట’ సినిమాని ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశాం. కొడైకెనాల్, కర్నూలు, వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. పాటలను ఈ నెలాఖరులో, ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రోజూ ఏ దినపత్రిక చదివినా, ఏ టీవీ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు, ఘోరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతిచోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు గోపీ గణేష్ పట్టాభి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: దాశరథి శివేంద్ర.