#మీటూ : చాలా సంతోషంగా ఉంది

Samantha and Varalaxmi Supports Me Too Movement - Sakshi

హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మహిళలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. బాలీవుడ్‌లో తనుశ్రీతో మొదలైన మీటూ.. దక్షిణాదిన గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్లతో తీవ్ర రూపం దాల్చింది. ఎంతో మంది మహిళా జర్నలిస్టులు కూడా తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువ గాయని ఆరోపించారు. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేస్తున్న అకృత్యాల గురించి జర్నలిస్టు సంధ్య మీనన్‌తో సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే.. తనుశ్రీ- నానా పటేకర్‌ వివాదంలో ట్వింకిల్‌ ఖన్నా, ఫర్హాన్‌ అక్తర్‌, సోనమ్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, అర్జున్‌ కపూర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కానీ చిన్మయికి సపోర్టుగా కోలీవుడ్‌ పెద్దలు మాత్రం ఇంత వరకు నోరు విప్పడం లేదు. అలాగే వైరముత్తు వ్యవహారంపై కూడా మౌనంగానే ఉన్నారు. అయితే హీరోయిన్లు సమంత, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాత్రం చిన్మయికి మద్దతుగా నిలిచి ఆమె ఒంటరి కాదంటూ ‘మీటూ’ ఉద్యమం మరింత ఉధృతం కావాలని ఆశిస్తున్నారు.

చాలా సంతోషంగా ఉంది..: సమంత
‘నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మహిళలు ముందుకు వస్తున్నారు. మీ ధైర్యానికి జోహార్లు. కానీ కొంతమంది వ్యక్తులు.. (వారిలో మహిళలు కూడా ఉండటం బాధాకరం) మీ మాటల్లో నిజమెంత, ఆధారాలు చూపించండి అంటూ మిమ్మల్ని మరోసారి వేధిస్తున్నారు. కానీ ఎంతో మంది మీకు మద్దతుగా ఉంటారు. మీటూ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నా అంటూ ట్వీట్‌ చేసి.. బాధిత మహిళలకు అండగా నిలుస్తానని చెప్పారు సమంత. అదే విధంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కూడా ‘మీటూ’కి తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బాధితులు తమని తాము బలహీనులమని అనుకోవద్దని.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top