పీజే శర్మ ఇక లేరు

పీజే శర్మ ఇక లేరు


* నటుడు, అనువాద కళాకారుడు పూడిపెద్ది జోగీశ్వర శర్మ

* గుండెపోటుతో కన్నుమూత

* తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 500కుపైగా చిత్రాల్లో నటన

* వెయ్యి చిత్రాల్లో ప్రముఖ నటులకు గాత్రదానంసాక్షి, హైదరాబాద్/విజయనగరం: ప్రముఖ నటుడు, అనువాద కళాకారుడు, రచయిత పీజే శర్మ(82) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పీజే శర్మ అసలు పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కళ్లేపల్లి రేగ గ్రామంలో జన్మించారాయన. నాటకాలపై అభిలాషతో పన్నెండేళ్ల వయసులోనే రంగస్థల ప్రవేశం చేసి.. తన 55ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 500కుపైగా చిత్రాల్లో నటించారు.సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, అమితాబ్‌లతో కలసి ఎన్నో సినిమాల్లో నటించిన ఘనత పీజే శర్మది. డబ్బింగ్ కళాకారునిగా పీజే శర్మది ఓ శకం. దాదాపు వెయ్యి చిత్రాల్లో ప్రముఖ నటులకు గాత్రదానం చేశారాయన.విజయనగరం జిల్లాలో షూటింగ్ జరిగిన కన్యాశుల్కం 34 ఎపిసోడ్‌ల సీరియల్‌లో ఆయన లుబ్ధావధానులుగా నటించారు. 1959లో విడుదలైన ఇల్లరికం చిత్రంతో నటునిగా చిత్రపరిశ్రమలో ప్రవేశించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ శర్మకు చివరి చిత్రం.మనవడు ఆది వివాహానికి హాజరుకాలేకపోయిన శర్మ

శనివారం ఉదయం జరిగిన తన మనవడు, యువ హీరో ఆది వివాహానికీ అనారోగ్యం కారణంగా శర్మ రాలేకపోయారు. ఆ మరుసటి రోజే ఆయన గుండెపోటుతో మరణించారు. శర్మ మరణంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపింది.ప్రముఖుల సంతాపం..

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సనత్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, సినీ ప్రముఖులు ఎస్‌వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, అశోక్‌కుమార్, మహర్షి రాఘవ, ఉత్తేజ్, ముత్యాల సుబ్బయ్య తదితరులు మణికొండ పంచవటి కాలనీలోని శ్రీసాయి అవెన్యూకు తరలివచ్చి శర్మ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కుమారుడు సాయికుమార్‌ను ఓదార్చారు. తండ్రి మరణంతో ఆయన ఎంతో కుంగిపోయి రోదిస్తూ కనిపించారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డ శ్మశాన వాటికలో పీజే శర్మ అంతిమ సంస్కారం నిర్వహించారు.చంద్రబాబు సంతాపం

పీజే శర్మ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. శర్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కుమారులు.. ముగ్గురూ ముగ్గురే

శర్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు సాయికుమార్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించి డబ్బింగ్ రంగంలో ‘డైలాగ్ కింగ్’ అనిపించుకోగలిగారు. తర్వాత హీరోగా తెలుగు, కన్నడ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేరక్టర్ నటునిగా సాయికుమార్ బిజీ బిజీ.ఇక రెండో కుమారుడు రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా నంబర్‌వన్ అనిపించుకున్నారు. ‘బొమ్మాళీ రవిశంకర్’గా ఆయన ప్రాచుర్యమయ్యారు. మూడో కుమారుడు అయ్యప్ప పి.శర్మ దర్శకునిగా తెలుగులో ఈశ్వర్ అల్లా, హైదరాబాద్, కన్నడంలో వరదనాయక, వీరా చిత్రాలకు పనిచేశారు. పీజే శర్మ మనవడు, సాయికుమార్ తనయుడు ఆది... ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలోని యువహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top