నటనకు సూరేకారం 

Remembering Telugu Actress Suryakantham on her Birthday - Sakshi

ఆ పేరంటేనే అందరికీ హడల్‌ 

జిల్లావాసి సూర్యకాంతానికి అరుదైన ఆదరణ 

ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే ఆమె గయ్యాళి అత్త పాత్రకు పెట్టింది పేరయ్యారు. అది ఎంతగా అంటే ఆమె పేరు పెట్టుకోవడానికి తెలుగువారు భయపడేంత. ఆమె ఎవరో కాదు.. సూర్యకాంతం. తూర్పు గోదావరి జిల్లా వాసే.. అక్టోబర్‌ 28న ఆమె జయంతి సందర్భంగా ఆమెకు ‘సాక్షి’ స్మృత్యాంజలి 

సాక్షి, మధురపూడి (రాజానగరం): వీధుల్లో, కుళాయిల వద్ద ఎక్కడైనా మహిళలకు తగాదాలొచ్చినా, అత్తగారి నుంచి కోడలికి వేధింపులు జరిగినా వినబడే పేరు సూర్యకాంతం. నటనలోనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె పేరు చిరంజీవిగా నిలిచిపోయింది. గయ్యాళి అత్తగా, గడ సరి మహిళగా ఆమె మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఆ పేరు వరి్థల్లుతోంది. సుమారు 780 సినిమాల్లో ఆమె నటించారు.  జిల్లాలో చిత్రీకరించిన అనేక సినిమాల్లో నటించారు. కోరుకొండ మండలం దోసకాయలపల్లి, నిడిగట్ల, బూరుగుపూడిల్లో, రాజానగరం మండలం నరేంద్రపురం తదితర గ్రామాల్లో జరిగిన షూటింగ్‌ల్లో పాల్గొన్నారు. జిల్లాలో చిత్రీకరించిన సినిమాల్లో ఆమెకు మంచి పేరు తెచ్చినవి ఎనీ్టఆర్‌ బడిపంతులు, ఏఎన్నార్‌ అందాలరాముడు, మూగమనసులు.
 
‘‘మంచి మనసులు’లో ఎస్వీఆర్, సూర్యకాంతం 
ఆమె సెట్‌లోకి వస్తే అలెర్ట్‌   
సూర్యకాంతం సినిమా షూటింగ్‌ సెట్‌లోకి వస్తే అంతా అలర్ట్‌ అవుతారనే నానుడి ఉంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆమె నటించినా హీరోలు సైతం అలెర్ట్‌ కావల్సిందే. గుండమ్మ కథ సినిమాలో  ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలైనప్పటికీ గుండమ్మ అక్క పాత్రకే ప్లస్‌ మార్కులను ప్రేక్షకులిచ్చారు.   
నటనలో ఆమెకు ఆమే సాటి 
నటనలో సూర్యకాంతాన్ని ఓవర్‌టేక్‌ చేయగలవారు రాలేదు. గుండమ్మ కథను నేటి ప్రముఖ యువ హీరోలతో తీయడానికి నిర్మాతలు ఉన్నా ఆ పాత్రలో నటించగల నటి లేకపోవడంతో ఆ చిత్రం మళ్లీ రూపుదిద్దుకోలేదు.  

జీవన ప్రస్థానం 
సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్‌ 28వ తేదీన పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నం దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. కాకినాడ మెక్లారిన్‌ స్కూల్‌లో చదువుకున్నారు. నాట్యం, నటనలో ఆసక్తిగల ఆమె కాకినాడలోని యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో చేరి మరింత ప్రావీణ్యతను సంపాదించుకున్నారు.  సినిమాలపై మక్కువతో మద్రాసు వెళ్లి జెమినీ సంస్థలో ఉద్యోగిగా చేరారు.

ఆమె తొలి చిత్రం ‘చంద్రలేఖ’. అందులో ఆమె డ్యాన్సర్‌గా నటించారు. హీరోయిన్‌గా ‘సౌదామి’ని చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ కారు ప్రమాదంలో ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం తప్పిపోయింది. దాంతో హీరోయిన్‌గా నటిద్దామనుకున్న ఆమె కల తీరనే లేదు. ఏఎన్నార్‌ నటించిన ‘సంసారం’ చిత్రంలో ఆమె గయ్యాళి అత్త పాత్రను తొలిసారిగా చేశారు. తరువాత ఆమె ఇక తిరిగి చూడనక్కర్లేకపోయింది.  1950లో పెద్దిబొట్ల చలపతిరావుతో ఆమెకు వివాహమయ్యింది. ఆమె చివరి సినిమా ‘వన్‌ బై టూ’ (1993). సూర్యకాంతం 1996 డిసెంబర్‌ 17న కన్నుమూశారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top