నోరు జారింది బుక్కయ్యింది 

Rashmika Mandanna Criticised By A Section Of Kannadigas - Sakshi

చెన్నై : నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేం. నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. అత్యుత్సాహం ఒక్కోసారి చిక్కుల్లో పడేస్తుంది. ముఖ్యంగా బహిరంగ వేదికల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే నటి రష్మిక బుక్కయ్యింది. గీతాగోవిందం చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ చిత్ర అనూహ్య విజయంతో అనుకోకుండా స్టార్‌ అయిపోయిన కన్నడ నటి రష్మిక మందనా అన్న విషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాత టాలీవుడ్‌లో అవకాశాలు వరుసకడుతున్నాయి. గీతాగోవిందం చిత్ర హీరో విజయ్‌దేవరకొండతోనే మరోసారి డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో జత కట్టింది. అంతే కాదు ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో జతకట్టే అవకాశాన్ని కొట్టేసింది.

ఇక కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తోంది. ఇలా కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలను దక్కించుకుంటున్న రష్మిక పనిలో పనిగా తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయం అటుంచితే ఈ అమ్మడు విజయ్‌దేవరకొండతో నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఇటీవల తెరపైకి వచ్చింది. మిశ్రమ స్పందనతో చిత్రం ప్రదర్శింపబడుతోంది. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్‌ కోసం రష్మిక విజయ్‌దేవరకొండ, చిత్ర యూనిట్‌తో కలిసి నాలుగు రాష్ట్రాల్లోనూ చుట్టేసింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నారు. ఏ భాషలో నటించడం కష్టం అనిపిస్తోందన్న మీడియా వాళ్ల  ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా కన్నడ భాషలో మాట్లాడి నటించడం కష్టం అనిపిస్తోందని టక్కున చెప్పింది. అంతే బుక్కయ్యిపోయింది. అలా చెప్పి సొంత రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. మాతృభాషను మాట్లాడడం కష్టంగా ఉందంటావా అంటూ కన్నడ సంఘాలు రష్మికపై మండిపడుతున్నారు. అంతే కాదు బాయ్‌కాట్‌ డియర్‌ కామ్రేడ్‌ అంటూ ఈ అమ్మడి చిత్రాలపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీనికి నటి రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top