అమ్మాయిలూ.. బ్యాగులో పెప్పర్‌ స్ప్రే పెట్టుకోండి

Rashi Khanna Cute Speech about Venky Mama Movie - Sakshi

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నా. అందుకే బాలీవుడ్‌ వెళ్లాలనే ఆలోచన లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఏ భాష అయినా మనం చేసే పాత్రలు బాగుండాలి. ఎక్కడ మంచి పాత్రలొస్తే అక్కడే చేయాలి. అంతేకానీ, బాలీవుడ్‌లో చేయాలని ప్రాధాన్యత లేని పాత్రలొస్తే చేయను. కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, నాకు నచ్చక చేయలేదు’’ అన్నారు రాశీఖన్నా.

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాత. ఈ నెల 13న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా చెప్పిన విశేషాలు.  

పాండిచ్చేరిలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు సురేష్‌బాబు సార్‌ నా మేనేజర్‌కి కాల్‌ చేసి, నాతో మాట్లాడాలన్నారు. హైదరాబాద్‌ వచ్చేశా. ‘వెంకీ మామ’ గురించి చెప్పగానే కథ కూడా వినకుండా సురేష్‌ సార్‌పై ఉన్న నమ్మకంతో చేస్తానని చెప్పా. ఆ తర్వాత కథ విన్నాననుకోండి. పాత్ర ఏదైనా నా బెస్ట్‌ ఇవ్వాలనుకుంటాను.

చిరంజీవి, వెంకటేశ్‌సార్ల సినిమాలు హిందీలో డబ్‌ అయినప్పుడు చూస్తుండేదాన్ని.  వెంకటేశ్‌ సార్‌ కామెడీ టైమింగ్‌ చాలా బాగుంటుంది. ఆయన హావభావాలు భిన్నంగా ఉంటాయి. చైతన్యతో నటించడం సంతోషంగా ఉంది. నేను చేసే సినిమాలో హీరోలు, హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? అని ఆలోచించను. కేవలం సోలో హీరోయిన్‌గానే చేయాలనుకోను. నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందంటే చేస్తానంతే. ఏ రంగంలో అయినా పోటీ అనేది అవసరం.. అప్పుడే మరింత కష్టపడతాం.  

‘వెంకీ మామ’ చిత్రంలో హారికా అనే ఫిల్మ్‌ మేకర్‌ పాత్ర చేశా.. చాలా సరదాగా ఉంటుంది. ప్రస్తుతం నేను నటించిన ‘వెంకీ మామ, ప్రతిరోజూ పండగే’ సినిమాలు వారం గ్యాప్‌లో విడుదలవుతున్నాయి.. దీన్ని నేను ఒత్తిడిగా అనుకోవడం లేదు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలోనూ మంచి పాత్ర చేస్తున్నా. నేను సినిమాలు ఆలస్యంగా సైన్‌ చేయడం లేదు. వాటి విడుదలలో ఆలస్యం అవుతోందంతే. విడుదల అనేది నా చేతుల్లో ఉండదు కదా? ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేసినందుకు నేనిప్పటికీ హ్యాపీ. ఆ సినిమా ఎందుకో ప్రేక్షకులకు నచ్చలేదు. హిట్టు, ఫ్లాపు మన చేతుల్లో ఉండవు.  

► మంచి పాత్రలు కుదిరితే వెబ్‌ సిరీస్, లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తాను. గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత పెరిగింది.. మంచి పాత్రలొస్తున్నాయి. గతంలో పెళ్లయితే కెరీర్‌ ముగిసినట్టే. ఇప్పుడు అలాంటిదేం లేదు. సమంతగారు పెళ్లయినా సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చేస్తూ బిజీగా ఉండటం సంతోషం.  

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశా ఘటన విని చాలా కోపం వచ్చింది.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం తప్ప ఇంకేమీ చేయలేం. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అమ్మాయిలు తమను తాము రక్షించుకునేందుకు పెప్పర్‌ స్ప్రే తప్పకుండా వెంట బెట్టుకోవాలి. మహిళలతోనే కాదు.. తోటి వారితో ఎలా ప్రవర్తించాలో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top