శభాష్ నాయుడు పేరుతో దశావతారం సినిమాకు సీక్వెల్ చేస్తున్న హీరో కమలహాసన్ కుడికాలుకు రెండోసారి ఆపరేషన్ జరిగింది.
శభాష్ నాయుడు పేరుతో దశావతారం సినిమాకు సీక్వెల్ చేస్తున్న హీరో కమలహాసన్ కుడికాలుకు రెండోసారి ఆపరేషన్ జరిగింది. అమెరికాలో శభాష్ నాయుడు సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న కమల్.. గతనెల 13న చెన్నైకి తిరిగొచ్చారు. తర్వాతి షెడ్యూల్ గురించి చర్చించి మేడ మీద నుంచి కిందకు వస్తుండగా మెట్లపైనుంచి జారిపడ్డారు. దాంతో ఆయన కుడికాలు విరిగింది. దాంతో చెన్నై మౌంటురోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ చేసిన కాలు మళ్లీ నొప్పి పుడుతుండటంతో వైద్యులు ఆదివారం మరోసారి ఆపరేషన్ చేశారు.
కాగా, ఇటీవలే అమెరికా నుంచి చెన్నై వచ్చిన హీరో రజనీకాంత్.. స్వయంగా కమల్ను కలిసి పరామర్శించాలని భావించారు. అయితే రెండోసారి ఆపరేషన్ జరగడంతో అందుకు డాక్టర్లు అనుమతించలేదు. ఇక చేసేది లేక ఫోన్లోనే కమలహాసన్ను రజనీకాంత్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.