
పెరంబూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను వయోభేదం లేకుండా ఆబాలగోపాలం అభిమానిస్తుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 78 ఏళ్ల బామ్మ ఆయన వీరాభిమానే కాదు, త్వరలో నెలకొల్పనున్న రజనీకాంత్ రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు కోసం వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా తీవ్రంగా కృషి చేయడం విశేషం. ఆమె పేరు శాంత. తిరుత్తూర్‌కు చెందిన ఈ బామ్మ రజనీకాంత్ వీరాభిమాని అట. రజనీకాంత్ త్వరలో ప్రారంభించబోయే రాజకీయ పార్టీలో సభ్యులను చేర్చడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారట.
ఈ విషయం గురించి రజనీ ప్రజా సంఘ నిర్వాహకులు రజనీకాంత్ దృష్టికి తీసుకురాగా ఆయన చాలా సంతోషపడ్డారు. శాంత చిరకాల కోరిక రజనీకాంత్‌ను ఒక్కసారి కలిసి ఆయనతో మాట్లాడాలన్నదట. విషయం తెలుసుకున్న రజనీకాంత్ శుక్రవారం బామ్మ శాంత పోయస్‌గార్డెన్‌లోని తన ఇంటికి పిలిపించి శాలువ కప్పి సత్కరించారు.