ముందు శాంపిల్... తర్వాత ఫుల్! | Rai Lakshmi's Velantains's Day Special | Sakshi
Sakshi News home page

ముందు శాంపిల్... తర్వాత ఫుల్!

Feb 14 2016 10:30 PM | Updated on Feb 10 2020 3:26 PM

ముందు శాంపిల్... తర్వాత ఫుల్! - Sakshi

ముందు శాంపిల్... తర్వాత ఫుల్!

పదేళ్లుగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయికగా చేయడంతో పాటు అతిథి పాత్రలూ, ఐటమ్ సాంగులూ చేస్తూ....

పదేళ్లుగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయికగా చేయడంతో పాటు అతిథి పాత్రలూ, ఐటమ్ సాంగులూ చేస్తూ రాయ్ లక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క హిందీ సినిమా అయినా చేయాలనీ, అది ఆషామాషీ సినిమా కాకూడదనీ ఎప్పట్నుంచో అనుకుంటున్నారామె. ఈ బ్యూటీ ఆశించిన విధంగానే బాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ మామూలుగా జరగడంలేదు. సోనాక్షీ సిన్హా కథానాయికగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘అకిరా’లో అతిథి పాత్ర చేస్తున్నారామె. ఈ  అతిథి పాత్ర చేయడం మొదలుపెట్టాక, ‘జూలీ 2’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో  అవకాశం దక్కింది.

గతంలో హిందీలో నేహా ధూపియా చేసిన ‘జూలీ’కి ఇది సీక్వెల్ కాదు. ఇది వేరే కథతో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి సంబంధించి రాయ్ లక్ష్మి ఫస్ట్ లుక్‌ని శనివారం విడుదల చేశారు. ‘‘ఇది శాంపిల్ మాత్రమే.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం మరో లుక్ విడుదలవుతుంది’’ అని రాయ్ లక్ష్మి ట్విట్టర్లో పేర్కొన్నారు. చెప్పినట్లుగానే మరో లుక్‌ని వేలంటైన్స్ డే స్పెషల్‌గా ఆదివారం విడుదల చేశారు. ఈ రెండు లుక్స్‌కీ అద్భుతమైన స్పందన లభిస్తోంది.

‘సూపర్ హాట్ గాళ్.. లవ్లీ’ అంటూ రాయ్ లక్ష్మి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దీపక్ శివ్‌దాసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి మొత్తం 25 నుంచి 30 రకాల లుక్స్‌లో, 90 రకాల కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారు. వాటిలో బికినీ కూడా ఉందని సమాచారం. నటిగా తనకిది 50వ చిత్రమనీ, ఈ చిత్రం ద్వారా కథానాయికగా హిందీ రంగానికి పరిచయం కావడం ఆనందంగా ఉందని రాయ్ లక్ష్మి అన్నారు.

ఫస్ట్ లుక్ కోసం పది నుంచి పదకొండు కిలోల బరువు తగ్గారామె. ఆ తర్వాత తగ్గిన పది కిలోలతో పాటు అదనంగా ఇంకా బరువు పెరగమని దర్శకుడు అన్నారట. పాత్ర డిమాండ్ మేరకు రాయ్ లక్ష్మి తగ్గి, పెరిగారు. ‘‘ఓ కథానాయిక చుట్టూ సాగే చిత్రమిది. నటి కాకముందు ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండేది? ఎలాంటి పరిస్థితుల్లో సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. వచ్చాక ఏం జరిగింది? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. అయితే, ఇది ఏ కథానాయిక జీవితానికి సంబంధించిన కథ కాదు’’ అని రాయ్ లక్ష్మి పేర్కొన్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.












Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement