సినిమా ప్రమోషన్‌ అందరి బాధ్యత

Ragala 24 Gantallo Promotional Song Launch by Devi Sri Prasad - Sakshi

– దేవిశ్రీ ప్రసాద్‌

‘‘ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అన్నదే ఉంటాయి. అందరూ మంచి సినిమా తీయాలనే చేస్తారు. ఒక్కోసారి ప్రేక్షకులు తిరస్కరిస్తుంటారు. ‘రాగల 24 గంటల్లో’ టీమ్‌ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి.. అవుతుంది కూడా’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రల్లో శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’.

శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన ఈ సినిమా ప్రచార పాటని దేవిశ్రీ ప్రసాద్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రచార పాటని విడుదల చేసినందుకు శ్రీనివాస్‌రెడ్డిగారు నాకు థ్యాంక్స్‌ చెబుతున్నారు.. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకే నేను థ్యాంక్స్‌ చెబుతున్నా. సినిమాని ప్రమోట్‌ చేయడం నటీనటులు, సాంకేతిక నిపుణుల బాధ్యత. సరిగ్గా ప్రమోట్‌ చేసి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినప్పుడే విజయం సాధించి మరో సినిమా రూపంలో అందరికీ పని దొరుకుతుంది.

సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉన్నా  కూడా ప్రమోషన్‌ చేయాలి. ఎవరికైనా విజయాలు, అపజయాలు సాధారణం. అయితే శ్రీనివాస్‌ రెడ్డిగారు అందరితో మంచివాడు అనే ట్యాగ్‌లైన్‌ పొందడం సంతోషం. ఆయన ఎన్నో సక్సెస్‌లు కొడుతూనే ఉండాలి’’ అన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను, రఘు కుంచె ప్రమోషనల్‌ సాంగ్‌ చేద్దామనుకున్నప్పుడు దేవిశ్రీగారి ప్రత్యేక పాటలే గుర్తొచ్చాయి. మా ఈ పాటకి ఆయన పాటలే స్ఫూర్తి. అందుకే ఈ పాటని ఆయనతో విడుదల చేయించాం.

ప్రస్తుతం యాక్టర్స్, టెక్నీషియన్స్‌ ప్రమోషన్స్‌కి రావడానికి ఇష్టపడటం లేదు. అందరూ రావాల్సిన అవసరం ఉంది. నిర్మాతలను కాపాడాల్సిన బాధ్యత నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియాపై ఉంది. నిర్మాత బాగున్నప్పుడే మరో సినిమా చేస్తారు.. దాని ద్వారా కొన్ని వందల మందికి పని దొరుకుతుంది. శ్రీనివాస్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు. ‘‘సినిమాలంటే చాలా ప్యాషన్‌. కనీసం ఓ టీవీ సీరియల్‌ అయినా తీయలేనా? అనుకునేవాణ్ణి.

సినిమా నిర్మిస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ, శ్రీనివాస్‌ రెడ్డి, కృష్ణ భగవాన్‌గార్ల వల్లే ‘రాగల 24 గంటల్లో’ సినిమా తీయగలిగాను. ఈ ఏడాదిలో వచ్చిన మంచి చిత్రాల్లో మా ‘రాగల 24 గంటల్లో’ సినిమా కూడా నిలుస్తుంది’’ అన్నారు శ్రీనివాస్‌ కానూరు. ‘‘నాకు మంచివాళ్లంటే ఇష్టం. అందుకే.. శ్రీనివాస్‌రెడ్డిని బ్రదర్‌ థెరిస్సా అని పిలుస్తుంటా. ఈ సినిమాతో ఆయన స్టార్‌ డైరెక్టర్‌ కావాలి.. శ్రీనివాస్‌ కానూరు పెద్ద నిర్మాత అవ్వాలి’’ అన్నారు నటుడు కృష్ణభగవాన్‌. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామన్‌ అంజి, పాటల రచయిత శ్రీమణి, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top