ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83 | Producer Vishnu Vardhan Induri Press Meet | Sakshi
Sakshi News home page

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

Sep 6 2019 6:40 AM | Updated on Sep 6 2019 6:40 AM

Producer Vishnu Vardhan Induri Press Meet - Sakshi

విష్ణువర్థన్‌ ఇందూరి

‘‘మహాభారతం, గాంధీ’ సినిమాలను ఒకే భాగంలో పూర్తి చేశారు. వాటిలాగా యన్‌టీఆర్‌ బయోపిక్‌ని ఒకే భాగంలో చెప్పి ఉంటే బాగుండేది. 60 శాతం షూటింగ్‌ పూర్తయ్యాక ‘యన్‌.టి.ఆర్‌. కథానాయకుడు, యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ అంటూ రెండు భాగాలుగా చెప్పడం, పైగా అప్పటి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మా సినిమా పరాజయానికి కారణాలు. ఏదేమైనా యన్‌టీఆర్‌ బయోపిక్‌ తీసినందుకు గర్వంగానే ఉంది’’ అని నిర్మాత విష్ణువర్థన్‌ ఇందూరి అన్నారు.

గురువారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్‌లో విష్ణువర్థన్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా సినిమాలు దాదాపు నా ఆలోచన నుంచే వస్తుంటాయి. నేను సీసీఎల్‌కి పని చేస్తున్నప్పుడు క్రికెట్‌ గురించి ఓ మంచి కథ చెప్పాలనిపించింది. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘83’ సినిమా. 1983లో క్రికెట్‌లో భారతదేశం ప్రపంచకప్‌ సాధించిన క్షణాలను ఎవరూ సులభంగా మరచిపోరు. అప్పట్లో క్రికెటర్లకు రోజుకు 200 పారితోషికం ఉండేది. ఎన్నో కష్టాలు, బాధల్లోనూ అప్పటి క్రీడాకారులు ఇండియాకి ఏ విధంగా గర్వకారణంగా నిలిచారు? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన అనుభవాలు, అవరోధాలు ఏంటి? వంటి స్ఫూర్తివంతమైన అంశాలతో ‘83’ సినిమా సాగుతుంది.

హిందీలో నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్‌ చేస్తాం. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో 20 శాతం పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. అదే విధంగా కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ రూపొందించనున్నాం. విజయేంద్రప్రసాద్‌గారు కథ అందిస్తున్నారు. జయలలిత బాల్యం నుంచి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయం వరకూ ఈ బయోపిక్‌లో చూపించనున్నాం. జయలలితగా కంగనా మేకోవర్‌ కోసం హాలీవుడ్‌ నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. అక్టోబర్‌ 15న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement