పోస్టర్‌లో పేరులా నిర్మాత మిగిలిపోకూడదు

Producer KS Rama Rao interview About Tej I Love You Movie - Sakshi

నిర్మాతకు ఫ్రీడమ్‌ లేదంటుంటారు. అసలు ఫ్రీడమే నిర్మాతది కదా. అతనికి ఫ్రీడమ్‌ ఇవ్వడం ఏంటి?  ఓ మంచి సినిమా తీయడం కోసం కావాల్సినవన్నీ తను సమకూర్చుకోగలగాలి. తన టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమా తీయించుకోవాలి’’ అని కేయస్‌ రామారావు అన్నారు. సాయిధరమ్‌ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్‌ ఐలవ్‌ యు’. క్రియేటీవ్‌ కమర్షియల్‌ బ్యానర్‌పై కేయస్‌ రామారావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్‌ రామారావు పలు విశేషాలు పంచుకున్నారు.

► ‘తేజ్‌ ఐ లవ్‌యూ’ మా బ్యానర్‌లో వస్తున్న 45వ సినిమా. ఇప్పటివరకూ మా బ్యానర్‌లో నిర్మించిన మంచి చిత్రాల్లో ఇది మరో మంచి చిత్రం. లవ్, ఎమోషన్స్, మంచి ఫీల్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. గోపీసుందర్‌ సంగీతం, కరుణాకరన్‌ టేకింగ్‌ స్టైల్, ఆండ్రూ అందమైన ఫొటోగ్రఫీ, సాయి ధరమ్‌– అనుపమ పెయిర్‌ మా సినిమాకు ప్లస్‌.

► నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 6 దశాబ్దాలు అవుతోంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉంటున్నప్పటి నుంచి కథలు వినడం, చదవడం అలవాటైంది. అది మా బ్యానర్‌లో నిర్మించిన చిత్రాల కథల సెలెక్షన్‌కి ఉపయోగపడింది. మొదట్లో సినిమాలకు రేడియోల ద్వారా పబ్లిసిటీ చేసేవాణ్ణి. అప్పట్లో అందరూ నన్ను రేడియో రామారావు, పబ్లిసిటీ రామారావు అని కూడా పిలిచేవాళ్లు. డైరెక్షన్‌ అంటే ఇంట్రెస్ట్‌ ఉంది కానీ నేను అంత క్యాపబుల్‌ కాదేమో అనుకుంటాను. అప్పట్లో సౌందర్యకు ఓ కథ కూడా చెప్పాను.

► నిర్మాతలు రెండు రకాలు ఉంటారు.  కేవలం పోస్టర్‌ మీద పేరులా ఉండేవాళ్లు ఒక రకం. మంచి కంటెంట్‌తో సినిమా తీద్దాం. మన బ్యానర్‌ పేరు గుర్తుండిపోయేలా సినిమా తీయాలని అనుకునేవాళ్లు మరో రకం. నిర్మాతలు అనే వాళ్లు కేవలం కాంబినేషన్‌ సెట్‌ చేసేవాళ్లు కాదు.

► కొత్త నిర్మాతలు వస్తున్నారు.. వెళ్లిపోతున్నారు అనడం కరెక్ట్‌ కాదు. ‘రంగస్థలం’ తీసింది  కొత్తవాళ్లే. ‘బాహుబలి’ తీసింది కూడా కొత్తవాళ్లే కదా. కొత్త పాత అని ఉండదు. ఎంత ఇష్టంతో నిర్మాత సినిమా తీశారన్నది ముఖ్యం.

► రచయిత యండమూరితో మళ్లీ అసోసియేట్‌ అవ్వడం లేదా?  అని అడుగుతున్నారు.  ఆయన నవలలు రాయడం తగ్గించాడు. నేను సినిమాలు తీయడం తగ్గించాను కదా (నవ్వుతూ).

► రామ్‌ చరణ్‌ ఫస్ట్‌ సినిమా నుంచి ఆయన నెక్ట్స్‌ సినిమా తీయాలనే అనుకున్నాను. ఎవ్వరైనా అనుకుంటారు. చిరంజీవిగారితో కూడా మళ్లీ ఓ సినిమా తీయాలనుంది. ఛాన్స్‌ ఉంటే చరణ్‌ కంటే ముందే చిరంజీవిగారితో సినిమా తీయాలనుంది.  చిరంజీవిగారితో దాదాపు నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. ఆయనకు, నాకు మధ్యలో కొన్ని డిస్ట్రబెన్స్‌ వచ్చినా ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ పేజీని మేమిద్దరం ఎప్పుడో తిప్పేశాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో డిస్ట్రబెన్సెస్‌  జరుగుతుంటాయి. కానీ అనవసరమైన వాటిని అవసరమైన దానికంటే ఎక్కువ చూపించకూడదని నా ఉద్దేశం.

► మా బ్యానర్‌లో నెక్ట్స్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. మంచి కంటెంట్‌తో సినిమా తీయాలని దర్శకులందరిలో పోటీ వాతావరణం ఉంది. ఇది మంచి పరిణామం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top