విజయ్‌కి ఆశలు రేపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌

Prashant Kishor Trying to Vijay entry in Politics - Sakshi

పెరంబూరు: రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్‌ కిషోర్‌  నటుడు విజయ్‌కు ముఖ్యమంత్రి ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీకి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌లకు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌ పేరు తమిళనాడుకు కూడా పాకింది. తమిళనాడులో 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో తమిళపాడులోని పలు రాజకీయ పార్టీలు ప్రశాంత్‌ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా ఇప్పటికే ఈయన మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రశాంత్‌ కిషోర్‌కు మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. పార్టీ విధానం విషయంలో ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాలను కమలహాసన్‌ విభేదించడమే అందుకు కారణం అని తెలిసింది. దీంతో  ప్రశాంత్‌ కిషోర్‌తో మక్కళ్‌ నీది మయ్యం ఒప్పందం రద్దు కానున్నట్లు సమాచారం. కాగా త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్న రజనీకాంత్‌ కూడా తనకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకోవాలను భావిస్తున్నట్లు, వీరిద్దరి మధ్య ముంబాయిలో భేటీ కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది.

విజయ్‌ను ముగ్గులోకి దించే ప్రయత్నాలు
ఇలాంటి పరిస్థితిలో ప్రశాంత్‌ కిషోర్‌ దళపతి విజయ్‌ను రాజకీయాల్లోకి  తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన బృందం సమగ్ర సర్వే నిర్వహిస్తుందట. తమిళనాడులో చేసిన సర్వేలో నటుడు విజయ్‌ పేరును చేర్చారట. అలా విజయ్‌కు 28 శాతం ప్రజలు ఆదరణ తెలిపారట. కాగా ఇటీవల ప్రశాంత్‌ కిషోర్‌ నటుడు విజయ్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. అప్పుడు తాము నిర్వహించిన సర్వే వివరాలను, ఆయనకు 28  శాతం మంది ప్రజల మద్ధతు తెలిపిన విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అంతే కాదు రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని గెలిపించడానికి తాము వ్యూహ రచన చేస్తామని తెలిపినట్లు తెలిసింది. అందుకు ఏడాది పాటు అనుసరించాల్సిన పథకాల గురించి వివరించినట్లు సమాచారం. వాటిని అమలు చేస్తే చాలు మీరే కాబోయే సీఎం అని ఆశలు రేకెత్తించినట్లు తెలిసింది.

తమిళ ప్రజలు ప్రస్తుతం విజయ్‌కు అనుకూలంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో యువకుడైన జగన్‌మోఃహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లు, తమిళనాడులో విజయ్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రశాంత్‌కిషోర్‌  పేర్కొన్నాట్లు సమాచారం. అయితే నటుడు విజయ్‌ మాత్రం చాలా ప్రశాంతంగా ఆయన చెప్పినవి విని  ఊరుకున్నారని, ఎలాంటి నిర్ణయాన్ని  వెల్లడించలేదని తెలసింది. నిజానికి విజయ్‌కు మరో ఐదేళ్ల వరకు రాజకీయ రంగప్రవేశం గురించి ఆలోచన లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top