
బాహుబలి చిత్రాల తరువాత ప్రభాస్ చేస్తున్న సాహోపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరకీ తెలిసిందే. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న సాహోను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. ట్రైలర్‌ను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక అప్పటినుంచి అన్ని భాషల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొన్నాడు. అక్కడి మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో వైఎస్ జగన్‌ను పొలిటికల్ బాహుబలిగా చూస్తారు.. మరి మీ మాటల్లో? అంటూ ప్రభాస్‌ను ప్రశ్నించగా... నాకు పాలిటిక్స్ అంతగా తెలియవు. అయితే, ఓ యువనేతగా జగన్ ఏపీని అభివృద్ది పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు బాగుంది. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగుంటుందనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం సాహో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.