నాగార్జున ఇంటి వద్ద ఓయూ విద్యార్థుల నిరసన

OU Students Dharna At Akkineni Nagarjuna House Over Bigg Boss Row - Sakshi

సాక్షి, జూబ్లీహిల్స్‌ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3కి హోస్ట్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్థులు ముట్టడించారు. బిగ్‌బాస్‌ షోను నిలిపి వేయాలంటూ, నాగార్జున డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఓయూ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు.

జేఏసీ నాయకులు డాక్టర్‌ కందుల మధు, వేల్పులకొండ వెంకట్‌ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ కోసం నటీనటుల ఎంపికకు స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారని, ఆ టెస్టులకు మహిళలను ఆహ్వానించి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. వేధింపులపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. సభ్యులను మూడు నెలలు నిర్బంధంలో ఉంచి రహస్యంగా దృశ్యాలు చిత్రీకరించడం, వారితో ముందుగానే బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్‌ రాసుకోవడం, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని ఆడవాళ్లను లైంగికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ షోను నిలిపివేసేలా కమిషన్‌ ఆదేశాలు ఇవ్వాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top