
ఆ ఇద్దరు విడిపోయినట్టేనా..?
కోన వెంకట్,గోపి మోహన్... ఈ రెండు పేర్లు ఒకప్పుడు టాలీవుడ్లో సక్సెస్కు కేరాఫ్ అడ్రస్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయటంలో తమ మార్క్ స్పష్టంగా చూపించిన ఈ జోడీ ఇప్పుడు విడిపోతోందా?
కోన వెంకట్, గోపి మోహన్... ఈ రెండు పేర్లు ఒకప్పుడు టాలీవుడ్లో సక్సెస్కు కేరాఫ్ అడ్రస్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయటంలో తమ మార్క్ స్పష్టంగా చూపించిన ఈ జోడీ భారీ విజయాలతో ఇండస్ట్రీ ఫేట్ మార్చేసింది. ఒకే కథను మళ్లీ మళ్లీ రాస్తారన్న పేరున్నా, అదే కథను అన్నిసార్లు ఒప్పించటంలోనూ సక్సెస్ అయ్యారు కోన వెంకట్, గోపి మోహన్. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ మ్యాజిక్ పెద్దగా వర్కవుట్ కావటం లేదు.
ముఖ్యంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. షాడో, అల్లుడు శీను, బ్రూస్ లీ లాంటి సినిమాలతో ఫ్లాప్ టాక్ రావటమే కాదు.. ఈ ఇద్దరి పెన్ను పవర్ తగ్గిపోయిందన్న అపవాదు కూడా తీసుకొచ్చాయి. ప్రస్తుతం కోన వెంకట్ రచన మీద కన్న నిర్మాణ రంగం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. త్వరలోనే దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే బాటలో గోపి మోహన్ కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు.
దాదాపు దశాబ్ద కాలం నుంచి కలిసి పనిచేస్తున్న ఈ ఇద్దరు స్టార్ రైటర్లు పెన్ను పక్కన పెట్టి మెగాఫోన్ పట్టుకోవటంతో ఇక మీదట వీరి కాంబినేషన్ కొనసాగుతుందా అన్న ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలను వేదిస్తుంది. ఒక్కసారి దర్శకుడిగా మారిన తర్వాత తిరిగి రచయితలుగా పనిచేసే ప్రయత్నం చేయరు కనుక.. ఇక కోన వెంకట్, గోపి మెహన్ల జోడీ విడిపోయినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.