
సాక్షి, చెన్నై : దక్షిణాదిలో ఇప్పుడు సంచలన నటి నయనతార రేంజే వేరు. ఆమె చిత్రాలు స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా వసూళ్లను కొల్లగొడుతున్నాయి. యువ నటుల నుంచి, ప్రముఖ నటుల వరకూ నయనతార స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోవడానికి తహతహ లాడుతున్నారనడం అతిశయోక్తి కాదు. నయనతార ప్రస్తుతం చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు తను నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. త్వరలో అజిత్‌తో విశ్వాసం చిత్రంలో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా యువ క్రేజీ నటుడు శివకార్తికేయన్‌తో రెండోసారి నటించనున్నారు. రాజేశ్.ఎం ఈ చిత్రానికి దర్శకుడు.
చాలా కాలం క్రితం లేడీ సూపర్‌స్టార్‌గా రాణించిన నటి విజయశాంతి మన్నన్ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో విజయశాంతి పాత్ర రజనీకాంత్ పాత్రకు దీటుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, అహంకారం కలగలిపిన ఆ పాత్రలో విజయశాంతి నటన ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నటి నయనతార కూడా లేడీసూపర్‌స్టార్ ఇమేజ్‌ను పొందారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించనున్న చిత్రం వినోదానికి పెద్ద పీట వేసే కథ అయినా, నయనతార పాత్ర మాత్రం కోపం, పౌరుషం కలిగి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది.