డీజీపీ రూప పాత్రనా.. అయితే సారీ!

nayana tara rejected to act as DIG roopa

సాక్షి, తమిళసినిమా: తమిళనాట రాజకీయ నాయకురాలిగా ప్రకంపనలు రేపిన శశికళ ప్రస్తుతం కర్ణాటకలో జైలులో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆమె రాజభోగాలు అనుభవిస్తున్నారన్న కథనాలు రావడం పెద్ద దుమారమే రేపింది. జైల్లో ఆమె బాగోతాన్ని అప్పటి కర్ణాటక జైళ్లశాఖ డీఐజీ రూప బట్టబయలు చేసి సంచలనం సృష్టించారు. శశి అనుకూలంగా జైల్లో జరిగిన అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, ఆమె అనుభవిస్తున్న రాజభోగాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన రూప కథ ఆధారంగా దర్శకుడు ఏఎంఆర్ రమేశ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో రాజీవ్‌గాంధీ హత్యోదంతాన్ని, బాబ్రీమసీదు నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించిన ఆయన తాజాగా డీఐజీ రూప కథ ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించడం సంచలనం రేపింది.

ఈ చిత్రంలో డీఐజీ రూప పాత్రలో నటి నయనతార లేదా అనుష్కను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట. అయితే, ఆయన ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్టు సమాచారం. డీఐజీ రూప పాత్రలో నటించడానికి నయనతార నిరాకరించిందని కోలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. సారీ.. అలాంటి రాజకీయ సంబంధమున్న పాత్రలను చేయనని నయన కరాఖండీగా చెప్పేసిందట. అనుష్క కూడా సైతం అదే మాట చెప్పిందని సమాచారం. శశికళకు సంబంధమున్న కథ కావడంతో రాజకీయ బెదిరింపులు వస్తాయని ఈ బ్యూటీలు భయపడ్డటు కోలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దీంతో నటి త్రిషపై దర్శకుడు రమేశ్‌ దృష్టి పడిందని తెలుస్తోంది. డీఐజీ రూప పాత్రలో నటించడానికి త్రిష అయినా 'ఎస్‌' అంటుందా? వేచి చూడాలి అంటున్నారు తమిళ సినీ జనాలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top