నిఖిల్‌ క్షమాపణలు చెప్పాలి

natti vasantha kumar fires on hero nikhil - Sakshi

‘‘ముద్ర’ సినిమా నాది కాదు. నా ఫోటో పెట్టుకొని టికెట్స్‌ అమ్ముకుంటున్నారు’ అని నిఖిల్‌ అంటున్నాడు. ఈ విషయం గురించి నిర్మాతను కానీ నన్ను కానీ అడిగావా? ఏమీ కనుక్కోకుండా సినిమా చూడొద్దంటావా? ఎవడో కన్నయ్య చెబితే నువ్వు పోస్ట్‌ పెడతావా? అన్నం పెట్టేది నిర్మాత. ఈ సినిమా చూడొద్దు అని కామెంట్‌ చేస్తే నష్టపోయేది ఎవరు? నిర్మాతే కదా. నీకేం పోయింది. నిర్మాతలను అవమానించినందుకు సోమవారంలోగా నువ్వు క్షమాపణలు చెప్పాలి’’ అని హీరో నిఖిల్‌పై నిర్మాత నట్టికుమార్‌ మండిపడ్డారు.

జగపతిబాబు హీరోగా నట్టికుమార్‌ నిర్మించిన చిత్రం ‘ముద్ర’ ఈ 25న రిలీజైంది. నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నిఖిల్‌ ముద్ర’. 24వ తారీఖు మధ్యాహ్నం ‘ముద్ర’ సినిమా నాది కాదు. కొందరు కావాలని నా సినిమానే విడుదలైనట్లు ప్రచారం చేస్తున్నారంటూ నిఖిల్‌ తన ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిని ఖండిస్తూ నిర్మాత నట్టికుమార్‌ శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ – ‘‘నిఖిల్‌ పోస్ట్‌ గురించి నాకు తెలిసిన వెంటనే ఆయనకు నోటీసులు పంపాను. సైబర్‌ క్రైమ్‌కు కంప్లైయింట్‌ కూడా చేశాం.

‘నిఖిల్‌ ముద్ర’ సినిమాను కొన్న వ్యక్తే నా సినిమాను రిలీజ్‌ చేశారు. మా సినిమా పోస్టర్స్‌ స్థానంలో నిఖిల్‌ సినిమా పోస్టర్స్‌ ఉన్నాయని, ఇలా పోస్టర్స్‌ మార్చి ఆన్‌లైన్‌లో టికెట్స్‌ అమ్ముతున్నారని ఆయనకు చెబితే ‘అలా జరగదు. జరిగినా ఊరుకోరు’ అని చెప్పారు. దాంతో మేం ఆన్‌లైన్‌లో చెక్‌ చేస్తే ఈయన (నిఖిల్‌) పేరు,  పోస్టర్స్‌ లాంటివి ఏం లేవు. మా సినిమా లిస్టే వస్తోంది. దాంతో మేం వదిలేశాం. కానీ సాయంత్రం ఓ టీవీలో నిఖిల్‌ తన సినిమా పోస్టర్‌ ఉందన్నట్లుగా మాట్లాడాడు. నా టైటిల్‌ లాక్కున్నారు అన్నాడు. నా సినిమా సెన్సార్‌  అయింది.

నీ టైటిల్‌ ఎక్కడ లాక్కున్నాను? నువ్వు నిజంగా హీరోవైతే సాక్ష్యాలతో రా. ఏ చానల్‌కి వస్తావో చూసుకుందాం. నువ్వు కరెక్ట్‌ అయితే నీకు సెల్యూట్‌ చేస్తా. లేకపోతే ఇండస్ట్రీ నుంచి హీరోగా విరమించుకుంటావా? ఈ పరిస్థితిలో నేను కాకుండా మరో నిర్మాత ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాడు. నిర్మాత మీద గౌరవం లేదు. సినిమా చూడొద్దు అనడానికి నువ్వెవరివి? నష్టపరిహారం కట్టేదాక నీ సినిమా రిలీజ్‌ కాదు.  సోమవారం 7 గంటలకు మీటింగ్‌కు పిలుస్తున్నాను. ‘మా’ కూడా కలగజేసుకోవాలి. నిఖిల్‌ హీరోగా అనర్హుడు. ఇలా మాట్లాడితే ఎవరైనా అనర్హుడే. సోమవారంలోపు క్షమాపణ చెప్పకపోతే ఇంకా చాలా విషయాలు బయటపెడతాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top