వేడెక్కిన నడిగర్‌ ఎన్నికల ప్రచారం

Nadigar Sangam Election Are Going Very Interesting - Sakshi

పెరంబూరు: నడిగర్‌ సంఘంకు నటుడు కార్తీ సాయం అందించారని, మాజీ కార్యదర్శి రాధారవి మాత్రం డబ్బును దోచుకున్నారని నటుడు, ప్రస్తుత సంఘం అధ్యక్షుడు నాజర్‌ ఆరోపించారు. నడిగర్‌ సంఘం ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పోటీలో ఉన్న పాండవర్‌ జట్టు, స్వామి శంకరదాస్‌ జట్టు ఓట్ల కోసం పాట్లు కార్యక్రమం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాండవర్‌ జట్టు ఆదివారం తిరుచ్చిలో నాటక కళాకారులను కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేస్తున్న నటుడు నాజర్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో సంఘం ఎన్నికలు గట్టి పోటీ మధ్య జరిగాయన్నారు. ఈసారి ప్రశాంతంగా జరుగుతాయనుకుంటే తమ సభ్యుల కారణంగానే సవాల్‌గా మారాయన్నారు. తాము సంఘానికి రక్షణగా ఉంటామే కానీ అసత్య వాగ్దానాలు చేయమని అన్నారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో వ్యతిరేక వర్గం నిరాధార విమర్శలు చేస్తోందన్నారు. అసత్యపు వాగ్దానాలతో నాటక కళాకారుల మనసు దోచుకోవడం సాధ్యం కాదన్నారు. నడిగర్‌ సంఘంలో గానీ, సంఘ భవన నిర్మాణంలో గానీ ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. అయితే ఇందులోని సభ్యులు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు అయినా ఉండవచ్చునని, అది సమస్య కాదని పేర్కొన్నారు. అయితే సంఘంలో సభ్యుడు కాని నటుడు రాధారవి ఇంకో జట్టు కోసం ఓట్లు అడుగుతున్నారని హేళన చేశారు.

ఎన్నికలు జరుగుతాయి
ఎన్నికలు జరగనున్న ప్రాంతంలో భద్రత సమస్య ఏర్పడే అవకాశం ఉందంటూ పోలీసులు చెబుతున్నారని, ఆ విషయం గురించి విశాల్, పూచిమురుగర్‌లు చర్చిస్తున్నారని తెలిపారు. ముందుగా నిర్ణయించినట్లు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. పోలీసులు బందోబస్తును కల్పించాలని కోరారు. నటుడు రజనీకాంత్, కమలహాసన్‌ మధ్యంతరంగా ఉంటారని, సంఘ అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని వారు ఓటు వేస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇరుజట్లకు చెందిన వారు మిశ్రమంగా గెలిచినా సంఘ భవన నిర్మాణం కొనసాగుతుదని అన్నారు. నటుడు కార్తీ ఆర్థిక సాయాన్ని రచ్చ చేస్తున్నారని ఆయన ఎన్నికలకు ముందు నుంచి సంఘానికి ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారని మాజీ కార్యదర్శి రాధారవి మాత్రం సంఘం డబ్బును దోచుకున్నారన్నారు.

విశాల్‌ రాజకీయం చేస్తున్నారు
పాండవర్‌ జట్టుతో పాటు స్వామి శంకరదాస్‌ జట్టు ఆదివారం తిరుచ్చిలో మకాం వేసి అక్కడ నాటక కళాకారుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ఉదయ  మీడియాతో మాట్లాడుతూ నడిగర్‌ సంఘం ఎన్నికల్ని నటుడు విశాల్‌ రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పాండవర్‌ జట్టు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ జట్టులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్‌ దర్శకుడు, పేరు గాంచిన స్క్రిన్‌ప్లే, రైటర్‌ అయిన కె.భగ్యరాజ్‌ను నటుడు, అంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఐసరి గణేష్‌ గురించి విమర్శలు చేస్తున్నారని నిజానికి విశాల్‌నే ప్రచార ప్రియుడని అన్నారు. ఏ విషయంలోనైనా తన పేరే ఉండాలని భావిస్తాడని అన్నారు. నడిగర్‌ సంఘం కార్యదర్శిగా ఉండి నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా పోటీ చేస్తూ రాజకీయాలు చేసి పలు తప్పులు చేశారని ఆరోపించారు. నడిగర్‌ సంఘం భవన నిర్మాణం చేపట్టి 40 శాతమే పూర్తి చేయగలిగారని, మిగిలిన 60 శాతం పూర్తి చేయడానికి నిధి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ జట్టును గెలిపిస్తే ఆరు నెలల్లో సంఘ భవనాన్ని పూర్తి చేస్తానని ఐసరిగణేష్‌ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. నడిగర్‌ సంఘం నిర్వహించిన 18 కార్యవర్గ సమావేశాల్లో కార్యదర్శిగా ఉన్న విశాల్‌ పాల్గొనలేదని విమర్శించారు. ఇక సంఘం నుంచి 300 మందిని తొలగించిన ఘనత విశాల్‌దని అన్నారు. పలువురు సభ్యులను అవమానించారని అన్నారు. సంఘ ఎన్నికల్లో ద్వారా విశాల్‌ తన రాజకీయ ఇమేజ్‌ను పంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని నటుడు ఉదయ ఆరోపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top