‘శ్రీ’ విషాదం ఓ మిస్టరీ..?

Mystery Behind Sridevi Demise? - Sakshi

స్పృహ కోల్పోయి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడటంతో మృతి

తేల్చిన ఫోరెన్సిక్‌ రిపోర్టు.. శ్రీదేవి మృతి కేసులో అనూహ్య మలుపు

కేసు పోలీసుల నుంచి పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ

భౌతికకాయం తరలింపులో మరింత జాప్యం

నేటి మధ్యాహ్నం ఎంబామింగ్‌.. కేసు దర్యాప్తు ముమ్మరం

శ్రీదేవి భర్త బోనీకపూర్‌ని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు

ఆయన పాస్‌పోర్టు సీజ్‌ చేసినట్లు వార్తలు.. బోనీ, శ్రీదేవి కాల్‌డేటాలపై ఆరా

దుబాయ్‌/ముంబై : ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు.. గంట గంటకో సంచలన విషయం.. మొత్తంగా సినీనటి శ్రీదేవి మరణం ఓ మిస్టరీగా మారింది! గుండెపోటుతో మృతి చెందినట్టు ఆమె కుటుంబీకులు చెప్పిన విషయం అవాస్తవమని తేలిపోయింది. శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందిందని దుబాయ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చారు.

బాత్‌రూంలోని టబ్‌లో స్పృహతప్పి పడిపోవడం వల్లే మరణించినట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం దుబాయ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సమీ వాదీ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఇందులో శ్రీదేవి పూర్తిపేరును ‘శ్రీదేవి బోనీ కపూర్‌ అయ్యప్పన్‌’గా పేర్కొన్నారు. ఆమె పాస్‌పోర్టు నంబర్, ఘటన జరిగిన తేదీ, మృతికి కారణాలను వివరించారు. దుబాయ్‌ ప్రభుత్వ అధికారిక మీడియా కార్యాలయం కూడా తన ట్విటర్‌ ఖాతాలో.. శ్రీదేవి ప్రమాదవశాత్తూ స్నానాల తొట్టిలో పడిపోయి చనిపోయిందని తెలిపింది.

తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు ఈ కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేసినట్టు పేర్కొంది. మరోవైపు గల్ఫ్‌ న్యూస్‌ మరో కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి అల్కాహాల్‌ సేవించిందని, ఆ మత్తులో బాత్‌ టబ్‌లో పడిపోయి మరణించిందని పేర్కొంది. అయితే దీన్ని అధికారులెవరూ ధ్రువీకరించలేదు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లేందుకు కారణమేంటన్న దానిపై స్పష్టత రావడం లేదు. అలాగే బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం ఎంతవరకు సాధ్యమంటూ బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ సహా పలువురు ప్రశ్నిస్తున్నారు.

భౌతికకాయం తరలింపు మరింత జాప్యం
శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి తరలించడం మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నారు. కేసు పోలీసుల చేతి నుంచి పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదలాయించడంతోపాటు ఇతర చట్టపరమైన అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం ఇందుకు కారణం. భౌతికకాయం అప్పగింతకు మరో అనుమతి(క్లియరెన్స్‌) రావాల్సి ఉందని దుబాయ్‌ పోలీసులు చెప్పినట్లు యూఏఈలో భారత రాయబారి నవదీప్‌ సూరి తెలిపారు.

ఎలాంటి అనుమతి రావాల్సి ఉందని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఆ విషయం తెలియదు. అది వారి అంతర్గత వ్యవహారం..’’అని బదులిచ్చారు. భౌతికకాయాన్ని భారత్‌కు ఎప్పట్లోగా తరలిస్తారని అడగ్గా.. ‘టైం చెప్పడం కష్టం. ఇక్కడ చట్టపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది’అని పేర్కొన్నారు.

నేటి మధ్యాహ్నం ఎంబామింగ్‌
శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్‌ (మృతదేహం పాడవకుండా ఉండేందుకు చేపట్టే ప్రక్రియ) ఇంకా పూర్తి కాలేదు. మంగళవారం మధ్యాహ్నం ఎంబామింగ్‌ చేసే అవకాశం ఉన్నట్టు గల్ఫ్‌ న్యూస్‌ పేర్కొంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టుకు శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అయినా ముంబైకి తరలిస్తారా? లేదా మరింత జాప్యం జరుగుతుందా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

సుదీర్ఘంగా బోనీ విచారణ
శ్రీదేవి మృతి కేసులో ముమ్మరంగా విచారణ సాగుతోంది. దుబాయ్‌ పోలీసులు సోమవారం మధ్యాహ్నం బోనీని సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. ఆయన పాస్‌పోర్టు కూడా సీజ్‌ చేసినట్లు వార్తలు వచ్చినా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. శ్రీదేవితో హోటల్‌లో ఎప్పటివరకు ఉన్నారు? ముంబై నుంచి హోటల్‌కు ఎప్పుడు తిరిగొచ్చారు? సర్‌ప్రైజ్‌ చేద్దామని వచ్చారా? లేదా శ్రీదేవి మృతి విషయాన్ని హోటల్‌ సిబ్బంది చెబితే వచ్చారా? అన్న అంశాలపై పోలీసులు బోనీని ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే శ్రీదేవి దుబాయ్‌ వెళ్లినప్పట్నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? ఎవరితో ఫోన్‌లో మాట్లాడారు? అన్న అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

బోనీ కపూర్‌ ఫోన్‌ కాల్‌డేటాను సైతం విచారిస్తున్నట్టు సమాచారం. హోటల్‌ సిబ్బందిని సైతం దుబాయ్‌ విచారిస్తున్నారు. హోటల్‌లో శ్రీదేవిని చివరిసారిగా చూసిందెవరు? ఆ సమయంలో ఆమె ఏ పరిస్థితిలో ఉంది? ఆమె గదిలో ఎవరైనా ఉన్నారా? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు బోనీకపూర్‌ దుబాయ్‌లోనే ఉండాలని అక్కబి పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విభాగం చెప్పినట్టు తెలిసింది.  

ఆరోజు అసలేం జరిగింది?
శ్రీదేవి మృతి చెందిన రోజు ఏం జరిగిందన్న విషయంపై స్థానిక ఖలీజ్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. మేనల్లుడి వివాహ కార్యక్రమం తర్వాత బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ సహా కుటుంబీకులంతా ముంబై వచ్చేశారు. శ్రీదేవి మాత్రం కొద్దిరోజులు దుబాయ్‌లో ఉండి వస్తానని చెప్పింది. అయితే భార్యకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు బోనీ శనివారం సాయంత్రం మళ్లీ దుబాయ్‌కు వచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో (దుబాయ్‌ కాలమానం ప్రకారం).. శ్రీదేవి ఉన్న జుమేరా ఎమిరేట్స్‌ టవర్స్‌ హోటల్‌ చేరుకున్నారు.

నిద్రలో ఉన్న ఆమెను లేపి దాదాపు 15 నిమిషాలసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత భర్తతో కలిసి డిన్నర్‌కు వెళ్లేందుకు శ్రీదేవి సిద్ధమయ్యారు. బాత్రూమ్‌లోకి వెళ్లి 15 నిమిషాలైనా ఆమె బయటకు రాకపోవటంతో బోనీ తలుపుతట్టారు. దీంతో బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే శ్రీదేవి బాత్‌టబ్‌లో అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారు. వెంటనే బోనీ తన మిత్రుడిని పిలిచారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా అప్పటికే అప్పటికే శ్రీదేవి మృతిచెందారని ఖలీజ్‌ టైమ్స్‌ వివరించింది.

అనిల్‌ కపూర్‌ నివాసానికి ప్రముఖులు
శ్రీదేవి మృతి నేపథ్యంలో అనేకమంది బాలీవుడ్‌ ప్రముఖులు ముంబైలోని ఆమె మరిది అనిల్‌ కపూర్‌ ఇంటికి తరలి వస్తున్నారు. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషీ ఆదివారం నుంచి ఈయన ఇంట్లోనే ఉన్నారు. నటీనటులు మాధురీ దీక్షిత్, జయప్రద, టబు, అమీషా పటేల్, సౌత్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్, కమల్‌ హాసన్, ఆయన భార్య సారిక, కూతుళ్లు శృతి, అక్షర హాసన్‌లు, దివ్యా దత్తా, సారా అలీ ఖాన్, జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్, దర్శకులు భారతీ రాజా, ఫరా ఖాన్, కరణ్‌ జోహార్, ఫర్హాన్‌ అక్తర్, రితేశ్‌ సిధ్వానీ, శేఖర్‌ కపూర్, తెలుగు సినీ హీరో వెంకటేశ్‌ తదితర ప్రముఖులు సోమవారం ఉదయం అనిల్‌ ఇంటికి వెళ్లారు. అటు లోఖండ్‌వాలా ప్రాంతంలోని శ్రీదేవి ఇంటికి కూడా ఆమె అభిమానులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top