అందరూ బాగుండాలని... 

Mohan Babu Birthday Celebrations Postpone Due To Corona - Sakshi

ప్రతి ఏడాది ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు బర్త్‌డే వేడుకలు మార్చి 19న తిరుపతిలో ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది ఆ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. కరోనా కారణంగా వేడుక వాయిదా వేశానని మోహన్‌బాబు చెబుతూ – ‘‘1992లో శ్రీవిద్యానికేతన్‌ విద్యాలయం ప్రారంభించాను. అప్పటి నుండి 27 ఏళ్లుగా మార్చి19న నా పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా జరుగుతున్నాయి. విజ్ఞానులు, శాస్త్రవేత్తలు, మేధావులు, కళాకారులు  ఈ వేడుకలకు అతిథులుగా హాజరవుతుంటారు. ఎన్నో వేల మంది విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు కూడా  ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాను. కారణం మనందరికీ తెలిసిందే. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుండి మరో దేశానికి గాలి కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు గుంపులు, గుంపులుగా ఉన్నప్పుడు ఒకరినుంచి మరొకరికి ఈ వ్యాది సోకే ప్రమాదం ఉంది. అందరూ బావుంటేనే మనం బావుంటాం అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అందుకే ఈ ఏడాది శ్రీవిద్యానికేతన్‌ పాఠశాల అండ్‌ కళాశాలల వార్షికోత్సవాన్ని అదే రోజున జరిగే నా పుట్టినరోజు వేడుకను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను. కరోనా వైరస్‌ ఈ భూభాగం నుండి వెళ్లిపోయేవరకు జాగ్రత్తగా ఉండండి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top