మైకేల్‌ జాక్సన్‌ తండ్రి కన్నుమూత

Michael Jackson father Joe Jackson Dies - Sakshi

పాప్‌ మేనేజర్‌, పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌ తండ్రి జోయ్‌ జాక్సన్‌ ఇక లేరు. పాంక్రియాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న జోయ్‌(89) లాస్‌ వేగాస్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. జోయ్‌ మనవళ్లు రాండీ జాక్సన్‌ జూనియర్‌, టై జాక్సన్‌లు ట్విటర్‌లో ఈ విషయాన్ని దృవీకరించారు. 

మైకేల్‌ జాక్సన్‌ తనయుడు,  జోయ్‌  మనవడు ప్రిన్స్‌ మైకేల్‌ జాక్సన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం ఉంచాడు. ‘ అంకితభావానికి మారుపేరు ఈయన. కుటుంబం కోసం ఆయన కష్టమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు నడిచాడు’ అంటూ జోయ్‌ ఫోటోను ఉంచాడు. జోయ్‌ మృతితో ‘జాక్సన్‌’ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం జోయ్‌ మృతికి సంతాపం చెబుతున్నారు.

1928 జూలై 26న అమెరికాలోని అర్కన్‌సస్‌లోని ఫౌంటెన్‌హిల్స్‌లో జోయ్‌ జాక్సన్‌ జన్మించారు. ఆయనకు భార్య కేథరిన్‌ మరియు 11 మంది సంతానం. వీరిలో పుట్టగానే ఓ బిడ్డ చనిపోగా, మైకేల్‌ జాక్సన్‌ 8వ సంతానం. చిన్నతనంలోనే పిల్లలోని మ్యూజిక్‌ ట్యాలెంట్‌ను గుర్తించిన జోయ్‌ వారికి బాగా ప్రోత్సహించాడు. వారందరికీ మేనేజర్‌గా వ్యవహరిస్తూ వారిని ప్రపంచానికి పరిచయం చేశారు. తండ్రిగా కంటే ఓ మేనేజర్‌గానే జోయ్‌ తమ పట్ల కఠినంగా వ్యవహరించేవారని, ఆ క్రమశిక్షణే తమ ఎదుగుదలకు సహకరించిందని మైకేల్‌ జాక్సన్‌ పలు ఇంటర్వ్యూల్లో చెప్పటం చూశాం. పాప్‌ రారాజుగా వెలుగొందిన మైకేల్‌ జాక్సన్‌ (50) 2009, జూన్‌ 25వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.  జోయ్‌ చిన్న కూతురు జానెట్‌ జాక్సన్‌(52) కూడా పాప్‌ దిగ్గజమే. జోయ్‌కు పలు అవార్డులు కూడా దక్కాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top