సక్సెస్‌మీట్‌ అంటే సినిమా ఫ్లాప్‌

Mattu Vadalara movie Sucess Meet - Sakshi

– కీరవాణి

‘‘మత్తు వదలరా’ సినిమా గురించి మంచి టాక్స్‌ వినిపిస్తున్నాయి.. స్పందన బాగుందా చెర్రీ(నిర్మాత చిరంజీవిని ఉద్దేశించి). ఏంటీ.. ఇది సక్సెస్‌మీటా? కాదు కాదా? ఎందుకంటే టాలీవుడ్‌ సినిమా డిక్షనరీ వేరే ఉంది.. బాబుగారూ అంటే హీరో.. సక్సెస్‌ మీట్‌ అంటే సినిమా ఫ్లాప్‌ అయిందని అర్థం(నవ్వుతూ)’’ అని సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. ఆయన తనయులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ రానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టై¯Œ మెంట్‌ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న  విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కీరవాణి మాట్లాడుతూ– ‘‘2000సంవత్సరం కెరీర్‌ పరంగా నాకు చాలా బ్యాడ్‌టైమ్‌.. డబ్బుల పరంగానూ బ్యాడ్‌టైమే. ఆ రోజుల్లో నేను బాధ్యత తీసుకోవాల్సినటువంటి కుటుంబీకులు దాదాపు 30మంది ఉన్నారు. ఓ సందర్భంలో సింగపూర్‌ వెళ్లడం గురించి ఇంట్లో చర్చ వచ్చింది.. అక్కడికి వెళ్లేంత డబ్బులు మనవద్ద లేవని నేను అంటుంటే.. ‘నేను తీసుకెళతాను’ అన్నాడు కాలభైరవ.. అప్పుడు వాడికి నాలుగేళ్లు’.. ఇప్పటి వరకూ నన్ను తీసుకెళ్లేంత రెమ్యూనరేషన్‌ వాడికి రాలేదు కానీ, ‘మత్తు వదలరా’ తో వచ్చిందనుకుంటున్నా(నవ్వుతూ).. మంచి సినిమా తీసిన యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మత్తు వదలరా’ కథని రితేష్‌ రానా చెప్పినప్పుడు అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందనిపించింది. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో ఇప్పుడు ప్రమోషన్స్‌ పెంచాం’’ అన్నారు.  ‘‘రితేష్‌ రానా చెప్పిన కథ విన్నాక సినిమా చేయం అనే అవకాశమే లేదు.. అంత బాగుంది’’ అన్నారు మైత్రీ మూవీస్‌ నిర్మాత రవిశంకర్‌.  ‘‘షకలక’ శంకర్‌తో వినోద సన్నివేశాలు చిత్రీకరించాం.. కానీ, ఆ కామెడీ ట్రాక్‌ కథని ముందుకు తీసుకెళ్లదు అనిపించి పెట్టలేదు’’ అన్నారు రితేష్‌ రానా. ‘‘నటుడిగా నాకు రోల్‌ మోడల్‌ అంటూ ఎవరూ లేరు. అందరి సినిమాలూ చూస్తా’’ అన్నారు శ్రీ సింహా. ‘‘నాన్న(కీరవాణి), బాబాయ్‌(రాజమౌళి) గార్లు చెప్పకపోయినా వారి వల్లే మాకు ఈ అవకాశం వచ్చిందనుకుంటున్నాం’’ అన్నారు కాలభైరవ. నటుడు నరేశ్‌ అగస్త్య, కెమెరామెన్‌ సురేశ్‌ సారంగం పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top