మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్

మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - Sakshi


సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడానికైనా, బరువు పెరగడానికైనా సిద్ధపడిపోతారు కొంతమంది హీరోలు. అలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనుకునే హీరోల్లో మనోజ్ ఒకరు. దశరథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘శౌర్య’ నేడు విడుదలవుతోంది. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం కోసం మనోజ్ బొద్దుగా తయారయ్యారు. ఇక... మనోజ్ ముచ్చట్లు తెలుసుకుందాం...


‘శ్రీ’ నుంచి నాకు దశరథ్ గారు తెలుసు. ఆయన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది. ఒకరోజు ఫోన్ చేసి, కథ చెబుతానంటే ఇంటికి రమ్మన్నాను. 30 నిముషాల్లో కథ చెప్పారాయన. ఆ కథ నచ్చింది. ఆ తర్వాత గెటప్ ఎలా ఉండాలనే విషయం గురించి చర్చించుకున్నాం. మామూలుగా నా సినిమాలంటే ఫైట్లు, డ్యాన్సులు కామన్‌గా ఉంటాయనుకుంటారు. అలాగే నేను కొంచెం రఫ్ లుక్‌లో కనిపిస్తాను. కానీ, తనకలా వద్దనీ, కొంచెం బొద్దుగా, క్యూట్‌గా ఉండాలనీ దశరథ్ చెప్పారు. దాంతో బాగా తినడం మొదలుపెట్టాను. కానీ, నా మజిల్ పవర్ మాత్రం తగ్గలేదు. అందుకని పప్పు-ఆవకాయ్-నెయ్యి బాగా తినడం మొదలుపెడితే, అప్పుడు బుగ్గలు వచ్చాయి. ప్యాంటు, షర్ట్ టక్ చేసుకుని, పక్క పాపిడి తీసి, నున్నగా దువ్వుకుని, ప్లెయిన్ షర్ట్స్ వేసుకుని లుక్‌ని సెట్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం మొత్తం ఎనిమిది కిలోలు బరువు పెరిగాను.


ఈ చిత్రకథ విషయానికొస్తే.. మొదటి పది నిమిషాల్లో ఇది ఎలాంటి సినిమా? అనేది తెలిసిపోతుంది. అక్కణ్ణుంచి ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు దశరథ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. దశరథ్ తనను తాను ఊహించుకుని క్రియేట్ చేసిన పాత్రలో నేను నటించాను. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఇది పక్కా దర్శకుడి సినిమా. మొన్ననే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. సంగీత దర్శకుడు వేదాకి ఇది తొలి సినిమా అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు.


నేనే సినిమా ఒప్పుకున్నా మా ఇంట్లోవాళ్లతో, ఇతరులతో షేర్ చేసుకోను. నాకు కథ, పాత్ర నచ్చితే ఒప్పేసుకుంటాను. ఫైనల్‌గా అవుట్‌పుట్ చూపిస్తాను. జయాపజయాల గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే, మా నాన్నగారు కెరీర్‌లో శిఖరాగ్రంలో ఉన్నప్పుడూ చూశాను. డౌన్‌లో ఉన్నప్పుడూ చూశాను. అందుకే మాకు జయాపజయాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. మా నాన్నగారు ఈ సినిమా చూసి, ‘చాలా సటిల్‌గా చేశావ్’ అని అభినందించారు.


పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఒక్కటే. ఐదు సంవత్సరాల క్రితం నుంచే మాకు పరిచయం ఏర్పడింది. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఐదేళ్లు ఎవరి కంటా పడకుండా తిరిగి, మ్యానేజ్ చేశాం. పెళ్లి తర్వాత అందరి కంటా పడేలా తిరుగుతున్నాం. అదే తేడా (నవ్వుతూ)!


‘కులం, డ్రగ్స్... ఈ రెండూ చాలా ప్రమాదకరం. దయచేసి ఈ రెండింటినీ దగ్గరకు చేరనివ్వద్దు’ అని ఈ మధ్య యూత్‌కి చెబుతున్నాను. నా సినిమాను ఫలానా కులం వాళ్లే చూస్తారు... వేరే హీరోల సినిమాలు వాళ్ల కులం వాళ్లు చూస్తారు.. అనే పిచ్చి ఫిలాసఫీని నేను నమ్మను. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు.


ఈరోజు మూడు సినిమాలు విడుదలవుతున్నాయ్. నాకు పోటీల్లాంటివి ఉండవు. ‘మనం ముగ్గురం పార్టీ చేసుకుందాం’ అని ఆ మిగతా రెండు సినిమాల వాళ్లతో నేను అన్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతానికి చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్‌గా ప్రేక్షకులను నేను కోరుకునేది ఒక్కటే. అందరూ కలిసి నా సినిమాను థియేటర్లో చూడండి. పైరసీ చేయొద్దు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top