హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

Mahi V Raghav Interview About YS Rajasekhara Reddy - Sakshi

‘యాత్ర’ రచయిత, దర్శకుడు మహి వి.రాఘవ్‌తో సంభాషణ

వైఎస్‌ వంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌ అనుకున్నప్పుడు మీకు ఎదురైన సవాళ్లు ఏంటి?
సినిమా తీయాలనుకున్నప్పుడు భయం లేదు. కానీ, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి వచ్చిన జనాలను చూస్తే భయమేసింది. ఇంతమంది నాపై నమ్మకం పెట్టుకున్నారు. వారి అంచనాలను అందుకోగలమా? అని. అయితే నేను ఓ సినిమా కంటే వైఎస్‌గారి పాజిటివ్‌ స్టోరీ చెబుతున్నానని అనుకున్నా, అప్పుడు చాలా నమ్మకం కలిగేది. వైఎస్‌ గురించి నాకు చాలా తక్కువ తెలియడం వల్ల సినిమాపై నమ్మకం ఎక్కువ ఉండేది. అది తలరాతేమో తెలియదు కానీ, ఆయన కథ నేను ప్రజలకు చెప్పాలని రాసి ఉందేమో(నవ్వుతూ).  

‘యాత్ర’ కోసం ఓ డైరెక్టర్‌గా కాకుండా రచయితగా మీ అనుభవాలేంటి?
పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలకు స్వయంగా కథ రాసుకున్నా. వీటిల్లో ‘యాత్ర’ ∙రాయడం సులభంగా అనిపించింది. ఎక్కడా తడబడలేదు. అది ఎందుకో తెలియదు. ఈ చిత్రంలోని డైలాగ్స్‌ నేనేదో అనుకొనో, బాగా పరిశోధించి రాశానని చెప్పడానికో లేదు. ఆయన గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నవే రాశా.

వైఎస్‌ పాత్రని మీరు వేటిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు?
నేను ఆయన్ని దగ్గరి నుంచి చూడలేదు. చాలా మందిని కలిసి వారి అనుభవాలు తెలుసుకున్నా. యూట్యూబ్‌లో ఆయన గురించి ఉన్న ఇంటర్వూ్యలు, కథనాలు చదివా. ఆయనతో చాలా మంది ప్రయాణించారు. వారందరికీ చాలా అనుభూతులున్నాయి. వాటికి నా ఊహల్ని జతచేసి ‘యాత్ర’ చేశా. 


ఆ పాత్ర రాసేటప్పుడు మీ మానసిక సంఘర్షణ ఎలా ఉండేది? 

ఆయన ప్రజలకు దూరమై పదేళ్లవుతున్నా ఇప్పటికీ జనాలు ఆయన గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌... ఇలాంటి పథకాలు  కావొచ్చు, ఆయన తోటి మనుషులకు ఇచ్చిన విలువ కావొచ్చు... అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నాకు తెలిసిన వైఎస్‌లోని లక్షణాల నుంచి పుట్టింది ‘యాత్ర’ కథ. ఆయనది హీరో పాత్రనా, దేవుడి పాత్రనా అన్నది అనుకోలేదు. 

ఏ సన్నివేశం రాస్తున్నప్పుడు మీరు బాగా ఎంజాయ్‌ చేశారు? 
వైఎస్‌ అనగానే రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ గుర్తుకొస్తాయి. అలాంటి రైతు బాంధవుడికి ఓ రైతు తన కష్టం ఎలా చెబుతాడు? దానికి వైఎస్‌గారు ఎలా రియాక్ట్‌ అవుతారన్నది ఒకటి, రెండు పేజీల డైలాగులతోనూ చెప్పొచ్చు. కానీ, ఒక్కమాట కూడా రైతు చెప్పకుండానే ‘నాకు వినపడుతోందయ్యా, నేను విన్నాను... నేను ఉన్నాను’ అనే డైలాగ్‌తో చెప్పించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఆస్పత్రి సన్నివేశంలో ఆ ఎమోషన్స్‌ని క్యాప్చర్‌ చేయగలిగాం. నాకు బాగా నచ్చిన సన్నివేశం అదే.

సినిమాకి వచ్చిన స్పందనకి మీలోని రచయిత సంతృప్తి చెందాడా?
నేను ఓ ఐదు, పదేళ్లు సినిమాలు చేసినా, వంద కోట్ల బడ్జెట్‌ సినిమా చేసినా ‘యాత్ర’ నాకు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంటుంది. ‘ఆనందోబ్రహ్మ’ చూసి నవ్వుకున్నాం అంటారు. కానీ, ‘యాత్ర’ అనేది ప్రజల్లో ఎమోషనల్‌ ఇంపాక్ట్‌ ఇచ్చింది. అది చాలా కష్టం. వేరే హిట్‌ సినిమాలు చాలా ఉండొచ్చు. కానీ, వైఎస్‌ అభిమానులతో పాటు రాయలసీమ ప్రజలు చూపించిన అభిమానం, ఆ ప్యాయత తెచ్చుకోవడం కష్టం. అవి దొరకడం నా అదృష్టం. ఏ బంధమో తెలియదు కానీ, ఆయన కథ చెప్పే గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు వైఎస్‌గారికి థ్యాంక్స్‌. దీనివల్ల ఓ ఫిలిం మేకర్‌గా నాకు విశ్వసనీయత, గుర్తింపు వచ్చాయి.

-డేరంగుల జగన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top