
15 ఏళ్ల తర్వాత.. తిరు, ఇందిర..
నటి సిమ్రాన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న విషయాన్ని హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన అప్‌కమింగ్ మూవీ రాకెట్రీకి సంబంధించిన విశేషాల్లో భాగంగా సిమ్రాన్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ పదిహేనేళ్ల తర్వాత తిరు, ఇందిర శ్రీమతి, శ్రీ నంబి నారాయణన్‌గా’ అంటూ రాకెట్రీ మూవీలో సిమ్రన్ క్యారెక్టర్‌ను రివీల్ చేశాడు. ఈ క్రమంలో.. ‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
కాగా బుల్లితెర ద్వారా గుర్తింపు పొందిన ఉత్తరాది భామ సిమ్రాన్.. తర్వాతికాలంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. అయితే కొంతకాలంగా టీవీ షోలతో బిజీగా ఉన్న సిమ్రన్.. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇటీవల రజనీకాంత్ పేట సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక గతంలో బాలచందర్ పార్థలే పరవశం, మణిరత్నం కన్నాతిల్ ముథమిట్టల్ సినిమాల్లో మాధవన్‌కు జంటగా నటించిన ఆమె.. తాజాగా సైంటిస్ట్ బయోపిక్‌లో మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో సిమ్రన్ కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనంత మహదేవన్‌తో పాటు మాధవన్ కూడా దర్శకుడిగా పని చేయాలనుకున్నారు. అయితే మహదేవన్ తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు.