ఎల్వీ ప్రసాద్‌గారు ఎందరికో స్ఫూర్తి

LV Prasad 111th Birthday Celebration - Sakshi

బాలకృష్ణ

‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ ఆయన రాణించారు. ప్రసాద్‌ ల్యాబ్స్‌ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అందుకే ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. గతాన్ని ఎవరూ మర్చిపోకూడదు. భావి తరాలకు చెప్పాలి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో బాలకృష్ణ అన్నారు.

అక్కినేని లక్ష్మీ వరప్రసాద్‌(ఎల్వీ ప్రసాద్‌) 111వ జయంతిని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్‌ నటి గీతాంజలి మాట్లాడుతూ– ‘‘నన్ను అందరూ సీతమ్మ అని పిలుస్తున్నారంటే కారణం పెద్దాయన ఎన్టీఆర్‌గారే. ‘సీతారామకల్యాణం’ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇల్లాలు’. అప్పట్లో ఎల్వీ ప్రసాద్‌గారి మెప్పు పొందాను’’ అన్నారు. ఎల్వీ ప్రసాద్‌ తనయుడు రమేశ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మా నాన్నకి సినిమా తప్ప మరేమీ తెలియదు. నన్ను నటుణ్ని చేయాలన్నది ఆయన కోరిక.

అయితే ఓ సారి ‘సంసారం’ సినిమా షూటింగ్‌లో అంత సేపు స్టూడియోలో కూర్చోవడం ఇష్టం లేక ఆయన్ని విసిగించాను. అప్పటి నుంచి నాకు యాక్టింగ్‌ మీద పెద్దగా ఆసక్తిలేదు. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను’’ అన్నారు. ‘‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్‌... ఇద్దరూ మహావృక్షాలు. తాము సంపాదించినదాన్ని సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు రమేష్‌ ప్రసాద్‌గారు ఓ మంచి బయోపిక్‌ తీయాలి’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్‌ చౌదరి అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top