‘బొమ్మరిల్లు’లో...‘ఇడియట్’ కుర్రాణ్ణి!

‘బొమ్మరిల్లు’లో...‘ఇడియట్’ కుర్రాణ్ణి! - Sakshi


‘‘ ‘బొమ్మరిల్లు’ లాంటి ఇంట్లోకి ‘ఇడియట్’ లాంటి కుర్రాడు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంలో నా పాత్ర అలా ఉంటుంది’’ అంటున్నారు యువ హీరో నాగశౌర్య. నంద్యాల రవి దర్శకత్వంలో నాగశౌర్య, అవికా గోర్ జంటగా మామిడిపల్లి గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ఇందులో అవికా గోర్‌ను ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అని పిలుస్తుంటాను. అందుకే... ఈ టైటిల్ పెట్టారనుకుంటా. కథంతా అవిక చుట్టూనే తిరుగుతుంది. నేనేమో ఆమె చుట్టూ తిరుగుతుంటాను.

 

 మా జంట ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది విడుదల అవుతున్న నా నాలుగో చిత్రమిది. ఇప్పటివరకూ విడుదలైన నా మూడు చిత్రాలూ విజయాలను అందుకున్నాయి. ఈ నాలుగో చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ఆకాంక్షించారు నాగశౌర్య. తను పోషించిన పాత్ర గురించి వివరిస్తూ -‘‘తన తండ్రిని ఒప్పిస్తేనే మన పెళ్లి అని హీరోయిన్ షరతు పెడుతుంది. దీంతో హీరోయిన్ ఇంట్లోకి ప్రవేశించిన హీరో... వాళ్లను పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేదే సినిమా. ఇందులో నేను పూర్తిగా ఎనర్జిటిక్‌గా ఉంటా. అలాగే నా పాత్రకు బాధ్యత కూడా ఉంటుంది. రవితేజకు ‘ఇడియట్’ ఎంతటి పేరు తెచ్చిందో, ఈ సినిమా నాకు అంతటి పేరు తెస్తుంది. నా గత చిత్రాలతో పోల్చి చూస్తే కచ్చితంగా ఇది కొత్త పాత్రే’’ అన్నారు నాగశౌర్య.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top