మా ఊరు పేరు నిలబెట్టాడు.. | kovvur people happy for ss rajamouli in forbes magazine | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లో కొవ్వూరు బిడ్డ

Dec 24 2017 12:49 PM | Updated on Oct 4 2018 4:43 PM

kovvur people happy for ss rajamouli in forbes magazine - Sakshi

పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్‌: స్టూడెంటు నంబర్‌ ఒన్‌ సినిమాతో సినీ వినీలాకాశంలో దర్శకుడిగా వెలసిన ధృవతార ఎస్‌ఎస్‌ రాజమౌళి. జిల్లాకు చెందిన ఈయనకు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన 2017లో అత్యధికంగా ఆర్జించిన వినోదరంగ ప్రముఖుల జాబితాలో చోటు దక్కింది. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన బం ధువులు, స్నేహితులు, తెలిసిన వారు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఎంటర్‌టైన్‌మెంటు విభాగంలో అత్యధిక సంపాదనపరుల జాబితాలో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 100 మంది జాబితాలో బాహుబలి జక్కన్న 15 స్థానంలో నిలవడం పట్ల ఆయన సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973లో కొవ్వూరులో పుట్టిన ఆయన బాల్యం, విద్యాభ్యాసం చాలా వరకూ కొవ్వూరులోనే జరిగింది. కొవ్వూరుకు చెందిన ఆయన దర్శకుడిగా శిఖరానికి చేరుకోవడం ఇక్కడి వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

కొవ్వూరుకు పేరు తెచ్చారు
రాజమౌళి కొవ్వూరుకే పేరు తెచ్చిన వ్యక్తి. సినిమా రంగంలో ఎంతో మంది దర్శకులు ఉన్నా, జక్కన్నగా పేరు తెచ్చుకోవడం, మా ఊరు వాడు కావడం మాకు ఎంతో గర్వకారణం. నేటి యువతకు రాజమౌళి ఆదర్శంగా నిలుస్తాడు. ఫోర్బ్స్‌ మ్యాగ్‌జీన్‌ ప్రకటించిన 100మంది జాబితాలో ఆయన పేరు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం – పరిమి హరిచరణ్, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి, కొవ్వూరు

చాలా ఆనందంగా ఉంది
ఎంటర్‌టైన్‌మెంటు విభాగంలో అత్యంత సంపాదనాపరులుగా రాజమౌళి పేరు ఉండడం ఆనందంగా ఉంది. ఫోర్బ్స్‌ మ్యాగ్‌జీన్‌ ప్రకటించిన జాబితాలో ఆయన 15వ స్థానంలో నిలవడం కొవ్వూరుకే గర్వకారణం. ఇక్కడ పుట్టి పెరిగిన ఆయనకు పేరు ప్రఖ్యాతులు రావడం గొప్ప విషయం – మద్దుల సత్యన్నారాయణ, లయన్స్‌ అధ్యక్షుడు, కొవ్వూరు 

Advertisement
 
Advertisement
Advertisement