అలాంటి చిత్రాల్లో నటించడం చాలా అవసరం

Keerthy Suresh In Sarakar Promotions - Sakshi

తమిళసినిమా: అలాంటి చిత్రాల్లో నటించడం హీరోయిన్లకు చాలా అవసరం అంటోంది నటి కీర్తీసురేశ్‌. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న నటి ఈ బ్యూటీ. నాన్న మలయాళం, అమ్మ తమిళం కావడంతో తాను ఆడా ఉంటా.. ఈడా ఉంటానంటూ మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో నటిస్తున్న కీర్తీసురేశ్‌ను కోలీవుడ్‌ ఎక్కువగా ఓన్‌ చేసుకుందని చెప్పవచ్చు. ఇక్కడ విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్, శివకార్తీకేయన్, విక్రమ్‌ప్రభు అంటూ వరుసగా స్టార్‌ హీరోలతో నటించేసింది. విశేషం ఏమిటంటే విక్రమ్, విశాల్‌లతో సీక్వెల్‌ చిత్రాల్లో కీర్తీ నటించడం. ఇక విజయ్‌తో నటించిన సర్కార్‌ ఇటీవల పలు వివాదాల మధ్య తెరపైకి వచ్చి వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్‌తో చిన్న భేటీ.

ప్ర: సర్కార్, సండైకోళి చిత్రాల్లో నటి వరలక్ష్మీతో కలిసి నటించడం గురించి?
జ: ఆ రెండు చిత్రాల్లో వరలక్ష్మి, నేను నటించినా, ఏ చిత్రంలోనూ మేమిద్దరం కలిసి నటించే సన్నివేశాలు లేవు. అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగో సమస్యలు లేవు. మంచి స్నేహమే ఉంది.
ప్ర: మహానటి చిత్రం మాదిరి మరో బయోపిక్‌లో నటించే అవకాశం ఉందా?
జ: లేదు లేదు. సావిత్రి జీవిత చరిత్ర చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని, పరిపక్వతను, సంతోషాన్ని కలిగించింది. మరోసారి అలా నేను నటించగలనా? అన్నది సందేహమే. అంతగా ఆ చిత్రం వచ్చింది. అది ఒక మ్యాజిక్‌. అదే విధంగా తరచూ అలాంటి పాత్రల్లో నటించడం కూడా సరి కాదు. భారీ కమర్షియల్‌ చిత్రాల్లోనూ నటించడం హీరోయిన్లకు చాలా అవసరం.
ప్ర: జయలలిత పాత్రలో నటించే అవకాశం వస్తే నటిస్తారా?
జ: ప్రస్తుతానికి ఎవరి బయోపిక్‌లోనూ నటించాలనుకోవడం లేదు. సావిత్రి పాత్రలో నటించడమే చాలా సంతృప్తి కలిగించింది.
ప్ర: నటనకు గ్యాప్‌ ఇస్తున్నారటగా?
జ: అవును. నటిగా పరిచయం అయినప్పటి నుంచే తీరిక లేకుండా చాలా బిజీగా నటిస్తున్నాను. అందుకే కొన్ని నెలలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 20కి పైగా కథలు విన్నాను. త్వరలోనే నూతనోత్తేజంతో నటించడానికి సిద్ధం అవుతా.
ప్ర: మహానటి చిత్రం తరువాత పారితోషికం పెంచినట్లు జరుగుతున్న ప్రచారం గురించి?
జ: అసలు కొత్తగా చిత్రాలే అంగీకరించలేదు. పారితోషికం పెంచానన్న ప్రచారంలో అర్ధం లేదు.
ప్ర: ఏ నటుడితో నటించాలని కోరుకుంటున్నారు?
జ: కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విశాల్, విక్రమ్‌ వంటి ప్రముఖ హీరోలతో నటించాను. నటుడు అజిత్‌తో నటించాలని ఆశగా ఉంది.
ప్ర: తొడరి లాంటి చిత్రాల అపజయం బాధించిందా?
జ: లేదు. నిజం చెప్పాలంటే జయాపజయాలను నేను ఒకేలా చూస్తాను. అన్నీ నచ్చి చేసిన చిత్రాలే. అలాంటి చిత్రాల నుంచి చాలా నేర్చుకుంటాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top