
బామ్మ కోసం భామ ఏం చేసిందో తెలుసా? సినిమా పవర్‌ఫుల్ మాధ్యమమే కాదు, ఒక స్టేజీ తరువాత అది నటీనటులకు ఒక వ్యసనంలా మారిపోతుంది కూడా. ఇక యువ నటి కీర్తీసురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి క్రేజీ కథానాయకి తనే. చిన్న వయసులోనే కమర్శియల్ హీరోయిన్ పాత్రలతో పాటు, హీరోయిన్ ఓరియెంటెడ్ కధా చిత్రాలు చేసేస్తూ ప్రశంసలు అందుకుంటున్న నటి కీర్తీసురేశ్.
యువత ఈ బ్యూటీ చిరునవ్వుకే ఫ్లాట్ అయిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి అభినందనలను అందుకున్న కీర్తీసురేశ్ మలయాళం, తమిళం, తెలుగు అంటూ దక్షిణ భాషలన్నింటిలోనూ నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం చేతిలో లేకపోయినా, ప్రశాంతత తరువాత వచ్చే తుపాన్ మాదిరి త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది.
అదేవిధంగా విజయ్‌తో ముచ్చటగా మూడోసారి అట్లీ దర్శకత్వంలో నటించనుందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇందులో అగ్రనటి నయనతార హీరోయిన్‌గా ఇప్పటికే ఎంపికైనట్లు సమాచారం. అదేవిధంగా టాలీవుడ్‌లో రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రంలోనూ కీర్తీకి హీరోయిన్ అవకాశం ఎదురుచూస్తోందనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ బిజీ అవుతున్న కీర్తీసురేశ్ తన బామ్మ కోసం అవకాశాల వేట మొదలెట్టిందట.
కీర్తీసురేశ్‌ది సినీ నేపథ్యం అన్న విషయం తెలిసిందే. ఈమె తల్లి మేనక గతంలో రజనీకాంత్‌కు జంటగా నెట్రికన్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. అలా కొన్ని చిత్రాల్లో నటించిన మేనక వివాహానంతరం నటనకు దూరమయ్యారు. అయితే ఆమె తల్లి సరోజ కూడా నటినే. అయితే సరోజ ఇప్పటికీ నటనను కొనసాగిస్తున్నారు. కీర్తీసురేశ్ హీరోయిన్‌గా నటించిన రెమో, కార్తీ హీరోగా నటించిన కడైకుట్టి సింగం వంటి చిత్రాల్లో బామ్మగా నటించారు.
ఇక సీనియర్ నటుడు చారుహాసన్‌కు జంటగా దాదా కథానాయకిగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో కీర్తీసురేశ్ తనకు కథలు చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతలతో తన బామ్మకు ఈ చిత్రంలో ఏదైనా పాత్ర ఉందా అని అడుగుతోందట. పాత్ర అంటే ఏదో ఒకటి ఇచ్చి తన బామ్మ ప్రతిభను అగౌరపరచరాదు, ఆమె మూడు తరాలు నటి.
అందుకే మంచి బలమైన పాత్రలు ఉంటే ఇవ్వండి అని అడుగుతోందట. చాలా మంది హీరోయిన్లు తన కోసం గానీ, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు కోసం అవకాశాలు అడుగుతారు. కీర్తీ ఏమిటీ తన బామ్మ కోసం అవకాశాల వేట మొదలెట్టింది అని సినీ వర్గాలు పరిహాస్యం చేస్తున్నారు
బామ్మ ఫుల్‌టైమ్ నటి కాదు
బామ్మ కోసం అవకాశాల వేట ప్రచారం నటి కీర్తీసురేశ్ చెవికి చేరింది. దీంతో కాస్త ఆగ్రహానికి గురైంది. తానేంటి బామ్మ కోసం అవకాశాలు అడగడం ఏమిటి ఇదంతా అసత్య ప్రచారం. అయినా తన బామ్మ ఫుల్‌టైమ్ నటి కాదు. ఆమె కోసం అవకాశాలను అడగాల్సిన అవసరం లేదు అని కీర్తీసురేశ్ స్పందించింది.