అర్జున్‌కు 50 ప్రశ్నలు

Karnataka Police Investigation to Arjun Sarjain Metoo Movement Case - Sakshi

నటి శ్రుతి మీ టూ కేసు కబ్బన్‌పార్క్‌ పీఎస్‌కు

హాజరైన నటుడు అర్జున్‌ పోలీసుల విచారణ  

ప్రతి ఆరోపణపై నిజమా.. కాదా? అని ప్రశ్న  

తోసిపుచ్చిన జెంటిల్మెన్‌

కర్ణాటక, యశవంతపుర:  ‘కోర్టులో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. నేనేమిటో నా అభిమాన కుటుంబానికి బాగా తెలుసు. శ్రుతి ఆరోపణలన్నీ అవాస్తవం’ అని ప్రముఖ నటుడు అర్జున్‌సర్జా అన్నారు. మీటూ వ్యవహారంలో అర్జున్‌ సర్జా పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి శ్రుతి హరిహరన్‌ ఆయనపై ఆరోపణలు సంధిస్తూ బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టడం తెలిసిందే. పోలీసులు సమన్లు పంపడంతో సోమవారం ఆయన కబ్బన్‌పార్క్‌ పోలీసుల ముందు విచారణకు హాజరై తన వాదనను వినిపించారు. ఆమె ఆరోపణలను పూర్తిగా నిరాకరిస్తున్నట్లు విచారణలో పోలీసులకు వివరించారు. శ్రుతి ఇచ్చిన ఫిర్యాదులో యుబీ సీటితో పాటు ఇతర ప్రాంతాలలోపంచనామా చేసిన విషయాలపైన కూడా అర్జున్‌ను సీఐ అయ్యణ్ణరెడ్డి విచారించారు.  

విచారణ సాగిందిలా  
నటి శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు, మేకప్‌ మ్యాన్‌ కిరణ్, సహ నిర్మాత మోనిక ఇదిరకే ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా సీఐ అయ్యణ్ణరెడ్డి సుమారు 50 ప్రశ్నలు... ఒక్కొక్కటే అడిగి సమాధానాన్ని సేకరించారు. లైంగిక వేధింపులపై ఇప్పటికే నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను, నాపై కావాలనే  కేసు పెట్టారామె, నేనెప్పుడు కూడ శ్రుతి హరిహరన్‌తో అసభ్యంగా ప్రవర్తించలేదు అని అర్జున్‌ చెప్పారు.  
ప్రెసిడెన్సి కాలేజీ అవరణలో జరిగిన షూటిం గ్‌లో శ్రుతితో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. ఒంటిపై గిల్లి, కౌగిలించుకున్నట్లు మీ మీద అరోపణలున్నాయని పోలీసులు ప్రశ్నించగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదు, కౌగిలించుకోలేదు, తాకలేదు అని అర్జున్‌ బదులిచ్చారు.  

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వార్నింగ్‌ ఇచ్చారా?  
బెంగళూరు దేవనహళ్లి ఆస్పత్రిలో షూటింగ్‌ జరుగుతుండగా అసభ్యంగా ప్రవర్తించారు, రెస్టారెంట్‌కు రా, కొంతసేపు గడుపుదాం అంటూ పిలిచిన్నట్లు ఆమె అరోపించారు. దీనికి మీ సమాధానం ఏమిటని పోలీసులు ప్రశ్నించగా తను ఆమెతో చెడుగా ప్రవర్తించలేదు, రెస్టారెంట్‌కు రమ్మని ఎప్పుడూ పిలవలేదన్నారు.  
దేవనహళ్లి పట్టణలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద శ్రుతిహరిహరన్‌తో కలిసింది నిజంకాదా? రెస్టారెంట్‌కు రమ్మని పిలిచింది నిజంకాదా? ఆమెను బెదిరించిన మాట నిజంకాదా? నాతో రాకుంటే సినిమా కెరీర్‌కు ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించిన మాట నిజంకాదా అని సీఐ అయ్యణ్ణ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.  
అర్జున్‌ బదులిస్తూ వీటన్నింటినీ నిరాకరిస్తున్నట్లు చెప్పారు. దేవనహళ్లి ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఇద్దరు ఎదురుపడిన మాట నూరు శాతం అవాస్తమన్నారు.  
బెంగళూరులోని యుబీ సిటీలో ఇద్దరూ ఒంటరిగా కూర్చున్న సమయంలో ఆమెను కౌగిలించుకుని రూంకు రమ్మన్నారు అని ప్రశ్నించగా,  ఆమెపై లైంగిక వేధింపుగాని, అసభ్యంగా ప్రవర్తించిది కానీ లేదన్నారు. మొత్తంగా అన్ని ఆరోపణలను అర్జున్‌ తోసిపుచ్చారు. అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని స్పష్టంచేశారు.  
విచారణకు అర్జున్‌ తనయుడు ధ్రువ సర్జా, మేనల్లుడు చిరంజీవి సర్జాతో కలిసి పీఎస్‌కు వచ్చారు. వీరి రాక గురించి తెలుసుకున్న అభిమానులు భారీసంఖ్యలో చేరుకున్నారు. దీనితో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top