ఆ గాయని పని పట్టడానికి సిద్ధం చేశానన్నారు.. | Sakshi
Sakshi News home page

అందుకు భయపడాలా?

Published Tue, Apr 16 2019 10:13 AM

k Rajan Comments on Chinmayi Sripada Metoo Movement - Sakshi

తమిళనాడు, పెరంబూరు: ఆ మధ్య మీటూ సినీ పరిశ్రమలో పెద్ద కలకలాన్నే సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్‌లో మీటూ సంచలనం సృష్టించిన గాయని చిన్మయి అనే చెప్పాలి. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె మీటూ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను వైరముత్తు ఖండించారు. అయితే ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమని చిన్మయి ప్రకటించారు. అదే విధంగా సీనియర్‌ నటుడు రాధారవిపైనా చిన్మయి ఈ ఆరోపణలే చేశారు. వీరి మధ్య మాటల యుద్ధం ఘాటుగానే సాగింది.

కాగా ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో నటుడు, నిర్మాత కే.రాజన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో తెరలేపారు. ఆయన ఇటీవల జరిగిన ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఒక గాయని ప్రఖ్యాత గీతరచయితపై మీటూ ఆరోపణలు చేసిందన్నారు. ఆయన ఎంతో కష్టపడి సంపాధించుకున్న పేరును, గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇంతటితో ఆపకుండా ఆమె ఇదే విధంగా దుష్ప్రచారం చేసుకుంటూ పోతే, తాను ఆ గాయని పని పట్టడానికి కొందరిని సిద్ధం చేశానన్నారు. దీనికి ట్విట్టర్‌లో బదులిచ్చిన గాయని చిన్మయి చాలా సింపుల్‌గా ఆయన మాటలకు తానిప్పుడు భయపడిపోవాలా? అని పేర్కొన్నారు. దీంతో మీటూ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చి రచ్చ చేసే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు.

Advertisement
 
Advertisement
 
Advertisement