లైవ్ ఆర్కెస్ట్రాతో...జురాసిక్ పార్క్ | 'Jurassic Park' Returning to Big Screen With Live Orchestra | Sakshi
Sakshi News home page

లైవ్ ఆర్కెస్ట్రాతో...జురాసిక్ పార్క్

Feb 14 2016 10:52 PM | Updated on Sep 3 2017 5:39 PM

లైవ్ ఆర్కెస్ట్రాతో...జురాసిక్ పార్క్

లైవ్ ఆర్కెస్ట్రాతో...జురాసిక్ పార్క్

డైనోసార్ల నేపథ్యంలో జరిగే ‘జురాసిక్ పార్క్’ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.

డైనోసార్ల నేపథ్యంలో జరిగే ‘జురాసిక్ పార్క్’ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ 1993లో తీసిన ఈ చిత్రం 23 ఏళ్ళ తరువాత మళ్ళీ సరికొత్తగా జనం ముందుకు రానుంది. లైవ్ ఆర్కెస్ట్రాతో ఈ సినిమాను ప్రదర్శించ నున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడైన 83 ఏళ్ళ జాన్ విలియమ్స్ కూర్చిన ఈ చిత్ర సంగీతాన్ని ఆర్కెస్ట్రా అప్పటికప్పుడు వాయిస్తుండగా, తెరపై సినిమాను ప్రదర్శించా లని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ వినూత్న ప్రదర్శన జరపనున్నారు.

అమెరికా బాక్సాఫీస్ చరిత్రలోని టాప్ 20 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో 8 చిత్రాలకు సంగీతం జాన్ విలియమ్స్‌దే. ఆయన సంగీతం అందించిన ‘హోమ్ ఎలోన్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’, ‘ఇ.టి’ చిత్రాల లాగే ఇప్పుడీ ‘జురాసిక్ పార్క్’ చిత్రానికి కూడా ‘ఫిల్మ్ కాన్సర్ట్స్ లైవ్’ ద్వారా ఈ లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన ఘనత దక్కనుంది. జాన్ విలియమ్స్‌కు 1974 నుంచి స్టీవెన్ స్పీల్‌బెర్గ్‌తో మంచి అనుబంధం ఉంది. స్పీల్‌బెర్గ్ చిత్రాల్లో అత్యధిక శాతానికి సంగీతం అందించింది ఆయనే. అయితే, జాన్ విలియమ్స్ సంగీతం కూర్చిన చిత్రాల్లో ‘జురాసిక్ పార్క్’కు విశిష్టమైన గుర్తింపుంది.

డైనోసార్లను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా తెరపై సృష్టించినప్పటికీ, అవి సజీవంగా నిలిచి, ఊపిరి పీల్చుకుంటున్న అనుభూతికి సంగీతమే ప్రధాన కారణమని నిపుణులు అంటారు. వచ్చే నవంబర్‌లో జరిగే ‘జురాసిక్ పార్క్ ఇన్ కాన్సర్ట్’ కార్యక్రమంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల పెద్ద తెరలపై పూర్తి హైడెఫినిషన్ క్వాలిటీలో ప్రదర్శించనున్నారు. ఆ పక్కనే తెర మీది దృశ్యానికి తగ్గట్లు పూర్తిస్థాయి సింఫనీ ఆర్కెస్ట్రా వాయిస్తారు. ఫలితంగా, తెర మీది చూస్తున్న దృశ్యం కళ్ళెదుట జరుగుతున్నట్లే అనిపిస్తుంది.

విశేషం ఏమిటంటే, ‘జురాసిక్ పార్క్’ సంగీతకర్త జాన్ విలియమ్స్ తాజా ఆస్కార్ అవార్డుల రేసులో కూడా ఉన్నారు. ‘స్టార్ వార్స్ - ది ఫోర్స్ ఎవేకెన్స్’ చిత్రానికి అందించిన సంగీతానికి గాను ఆయనకు ఈ నామినేషన్ దక్కింది. ఇప్పటికే పలుసార్లు ఆస్కార్ అందుకున్న ఆయనకు ఈసారీ వస్తుందా అన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement