యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ టీజర్‌.. సునీల్‌ రీఎంట్రీ

Junior NTR Aravindha sametha Teaser Blockbuster Hit - Sakshi

దుమ్మురేపుతున్న‘అరవింద సమేత’టీజర్‌

మూడు గంటల్లోనే ముప్పై లక్షల వ్యూస్‌

కమెడియన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న సునీల్‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ తన అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు. బుధవారం విడుదలైన ఎన్టీఆర్‌ తాజా సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకోంటోంది. టీజర్‌ విడుదలైన మూడు గంటల్లోనే దీనిని 30 లక్షల మంది వీక్షించారు. చిత్ర నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్‌ యూట్యూబ్‌ పేజీలో టీజర్‌ శరవేగంగా 4 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది. ఇతర యూట్యూబ్‌ చానెళ్లలోనూ ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. వరుస హిట్‌లతో ఊపుమీదున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో పక్కా మాస్‌ రోల్‌ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

రాయలసీమ యాస డైలాగ్‌లతో అభిమానులను అలరించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన పంథా మార్చుకొని వినూత్న రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొట్టొచ్చినట్టు​ కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కోసం ప్రముఖ సింగర్‌ కైలేశ్‌ ఖేర్‌తో ప్రత్యేక గీతాన్ని పాడారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో కైలాశ్‌ ఖేర్‌ పోస్టుచేశారు. తమన్‌ను ప్రశంసిస్తూ పాడిన ఓ పాట వీడియోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. ఈ టీజర్‌ చూసిన నందమూరి అభిమానులు.. యంగ్‌టైగర్‌ ఖాతాలో సింహాద్రి లాంటి భారీ యాక్షన్‌ హిట్‌ మరోసారి రిపీట్‌ అవుతుందని సంబరపడుతున్నారు. 

సునీల్‌ రీఎంట్రీ
కమెడియన్‌ నుంచి కథానాయకుడిగా మారిన సునీల్‌ మళ్లీ తన యథాస్థానానికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. హీరోగా వరుస అపజయాలతో డీలా పడిపోయిన సునీల్‌ను త్రివిక్రమ్‌ మరోసారి ఆదరించాడు. సునీల్‌కు కెరీర్‌ తొలినాళ్లలో కమెడియన్‌గా మంచి హిట్స్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ ఈ చిత్రంలోనూ ఆయనకు కీలకపాత్ర ఇచ్చినట్టు తెలుస్తోంది. టీజర్‌లో మెరున్‌ కలర్‌ టీషర్టుతో కనిపించడంతో సునీల్‌-త్రివిక్రమ్‌ల కాంబో మరోసారి అభిమానులను నవ్వించడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇది కమెడియన్‌గా సునీల్‌కు రీ ఎంట్రీ అని భావిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్‌ సంబంధించిన లీకులతో అంచనాలు పెరిగిన ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top