కాంట్రవర్సీ కోసం మాట్లాడలేదు

Jeevitha Rajasekhar Speech at Degree College Movie Trailer Launch - Sakshi

– జీవితా రాజశేఖర్‌

‘‘అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’’ చిత్రాల పుణ్యమా అని, లిప్‌లాక్‌ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. దర్శకులు, నిర్మాతలు, రచయితలు  సామాజిక బాధ్యతతో సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను’’ అని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ, నటి–దర్శకురాలు జీవితారాజశేఖర్‌ అన్నారు. వరుణ్, దివ్య జంటగా నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్‌’. ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం.

అసభ్యంగా ప్రవర్తించం. సినిమాలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో, టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదించవచ్చు. నిజమే.. ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూమ్‌లో కూర్చొని ఒంటరిగా చూస్తాం. సినిమా అనేది వందల మందితో కలిసి చూసేది. మీ కార్యక్రమానికి (‘డిగ్రీ కాలేజ్‌’ టీమ్‌ను ఉద్దేశిస్తూ) వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు. ఈ ట్రైలర్‌ని చూసి నా మనసుకు అనిపించినది చెబుతున్నాను’’ అన్నారు.

నరసింహనంది మాట్లాడుతూ ‘‘గతంలో సందేశాత్మక సినిమాలు చేశాను. అవార్డులు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. ‘హైస్కూల్‌’ చిత్రానికి వచ్చాయి. నాదైన నవ్య పంథాలో ఈ సినిమా తీశాను. ట్రైలర్‌ చూసి సినిమా మొత్తం వల్గర్‌గా ఉంటుందని అనుకుంటున్నారు. ఇందులో మంచి కంటెంట్‌ ఉంది. వాస్తవిక సంఘటనలకు సినిమాటిక్‌ అంశాలను పొందుపరిచి, ఈ సినిమా చేశాం. లిప్‌ లాక్‌లు, శృంగారభరిత సన్నివేశాలు కథ డిమాండ్‌ మేరకే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డిలతో తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top