ఆస్కార్‌కి ఇర్ఫాన్‌ నో బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌

Irfan khan no bed of roses nominated to oscar - Sakshi

ఏ పాత్రకైనా ప్రాణం పోసే సత్తా ఉన్న నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌. అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఇర్ఫాన్‌ఖాన్‌ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఫారిన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వృత్తిపరంగా ఆయన ఒక శుభవార్త విన్నారు. ఇర్ఫాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘నో బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌’ అనే బంగ్లాదేశ్‌ సినిమా ఆస్కార్‌ వరకూ వెళ్లింది. 91వ ఆస్కార్‌ అవార్డ్స్‌కి నామినేషన్‌ ఎంట్రీగా బంగ్లాదేశ్‌ తరఫున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. ముస్త్తఫా సర్వార్‌ ఫరూకీ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన సినిమా ‘నో బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌’. బెంగాలీలో ‘దూబ్‌’ అనే టైటిల్‌ పెట్టారు. ఇందులో జావెద్‌ హాసన్‌ అనే క్యారెక్టర్‌లో ఇర్ఫాన్‌  కనిపిస్తారు. బంగ్లా దేశీ ఫిల్మ్‌మేకర్‌ అండ్‌ రైటర్‌ హుమాయూన్‌ అహ్మద్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందన్న కారణంతో మొదట్లో ఈ మూవీపై నిషేధం విధించారు.

ఆ తర్వాత బంగ్లాదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో గత ఏడాది అక్టోబర్‌ 27న ఈ చిత్రం బంగ్లాదేశ్, ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో రిలీజైంది. ‘‘యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇర్ఫాన్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేకుండా ఈ సినిమాను ఊహించుకోలేను. ఆన్‌ సెట్స్, ఆఫ్‌ సెట్స్‌లో ఆయనతో మంచి ఎక్స్‌పీరియన్సెస్‌ను షేర్‌ చేసుకున్నా’’ అని పేర్కొన్నారు ఫరూకీ. ఇంతకుముందు ఫరూకీ దర్శకత్వంలోనే వచ్చిన ‘థర్డ్‌ పర్సన్‌ సింగులర్‌ నంబర్‌ (2009), టెలివిజన్‌ (2012) చిత్రాలు ఆస్కార్‌ ఎంట్రీకి. పరిగణించబడటం విశేషం. 90వ అకాడమీ అవార్డ్స్‌కి బంగ్లాదేశీ చిత్రం ‘ఖఛ’ వెళ్లింది. మొదట నిషేధం విధించిన ‘నో బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌’ సినిమాకు ఇప్పుడు అగ్రతాంబూలం దక్కడం విశేషమే కదా. ఇక ఇండియా తరఫున విదేశీ విభాగంలో అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఎంపికైంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top