ఒమన్‌పై పాక్ గెలుపు (PC: ACC X)
ఆసియా క్రికెట్ మండలి నిర్వహిస్తున్న ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2025 ( Asia Cup Rising Stars) టోర్నమెంట్ శుక్రవారం మొదలైంది. దోహా వేదికగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్- ‘ఎ’- ఒమన్ జట్లు తలపడ్డాయి. వెస్ట్‌ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ చేసింది.
పరుగుల విధ్వంసం
ఈ క్రమంలో ఆదిలోనే ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ (6) వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. మరో ఓపెనర్ మాజ్ సదాకత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి 96 పరుగులు చేసిన సదాకత్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
మిగతా వాళ్లలో యాసిర్ ఖాన్ (26 బంతుల్లో 26), మొహ్మద్ ఫైక్ (9 బంతుల్లో 19) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ 21 బంతుల్లోనే 44 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో సాద్ మసూద్ మెరుపులు (6 బంతుల్లో 19 నాటౌట్) మెరిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్-ఎ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 220 పరుగులు సాధించింది.
ఆది నుంచే కష్టాలు
ఒమన్ బౌలర్లలో షఫీక్ జాన్, ముజాహిర్ రజా, జే ఒడేడ్రా, వసీం అలీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సూఫియాన్ యూసఫ్ (3) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ హమ్మద్ మీర్జా (27 బంతుల్లో 34) రనౌట్ అయి వికెట్ పారేసుకున్నాడు.
వన్‌డౌన్లో వచ్చిన కరణ్ సోనావాలే (18 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మిడిలార్డర్‌లో వసీం అలీ (5), నారాయణ్ సాయిశివ్ (1), ఆర్యన్ బిస్త్ (2) పూర్తిగా నిరాశపరిచారు. జై ఒడేడ్రా డకౌట్ అయ్యాడు.ఘా
ఆఖర్లో మెరుపులు..
ఇలాంటి దశలో జిక్రియా ఇస్లాం, ముజాహిర్ రజా ధనాధన్ దంచికొట్టి జట్టు విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. జిక్రియా ఇస్లాం మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు- 57 పరుగులు) సాధించగా.. రజా 24 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. అయితే, మిగిలిన వారి నుంచి వీరికి సహకారం లభించలేదు.
బోణీ కొట్టిన పాక్
ఫలితంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. ఒమన్ కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పాకిస్తాన్ ఒమన్‌పై 40 పరుగుల తేడాతో గెలిచింది. విజయంతో ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింట్ స్టార్స్ టీ20 టోర్నీని ఆరంభించింది. మాజ్ సదాకత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


