డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే! | Sakshi
Sakshi News home page

డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే!

Published Tue, Apr 25 2017 9:47 AM

డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే! - Sakshi

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన లౌకికవాదాన్ని తెలియజెప్పేందుకు ఓ మంచి ప్రయత్నం చేశాడు. దేశ ప్రజలందరికీ తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. ఒక చిన్న వీడియో రూపొందించి.. దాని ద్వారా తన మతం ఏంటో అందరికీ తెలియజేశాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఆ వీడియోకు 16.66 అనే టైటిల్‌ పెట్టాడు.  

తనది ఏ మతమో తెలుసుకోడానికి తాను డీఎన్‌ఏ టెస్టు్ చేయించుకున్నానని ముందుగా అందులో చెబుతాడు. వీడియోలో ఎక్కడా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడని నవాజుద్దీన్.. అన్నింటినీ తెల్లటి ప్లకార్డుల మీద నల్లటి మార్కర్‌తో రాసి వివరిస్తాడు. ''హాయ్ నేను నవాజుద్దీన్ సిద్దిఖీని. నేను డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నా. దాని రిపోర్టు వచ్చింది. అందులో నేను ఎవరని ఉందంటే..'' అంటూ మొదలుపెడతాడు. అప్పటివరకు మామూలు ప్యాంటు, షర్టులలో ఉన్న నవాజ్.. ఆ తర్వాతి నుంచి ఒక్కో డ్రస్ మారుస్తుంటాడు.

తెల్లటి కుర్తా పైజమా ధరించి, నుదుటన సింధూరం పెట్టుకుని, భుజం మీదుగా కాషాయ వస్త్రం ఒకటి కప్పుకొని.. తాను 16.66% హిందువునని చెబుతాడు.

ఆ తర్వాతి షాట్‌లో నల్లటి బంద్‌గలా సూట్ వేసుకుని, తలమీద తెల్లటి ఫర్‌టోపీ పెట్టుకుని తాను 16.66% ముస్లింనని అంటాడు.


ఆపై గెడ్డం, మీసాలు, తలమీద ఎర్రటి తలపాగాతో కనిపించి 16.66% సిక్కునని వివరిస్తాడు.

అంతేకాదు, తెల్లగా పైనుంచి కింది వరకు ఒకటే డ్రస్ వేసుకుని, మెడలో శిలువ చైన్ ధరించి తాను 16.66% క్రిస్టియన్ అని కూడా చెబుతాడు.

ఆ తర్వాత బౌద్ధులు ధరించే కాషాయ దుస్తులు ధరించి, తాను 16.66% బౌద్ధుడినంటాడు.

మిగిలిన 16.66% ప్రపంచంలో మిగిలిన అన్ని మతాలు కలిసి ఉన్నాయంటాడు.


చివరగా.. తన తన ఆత్మను కనుగొన్నప్పుడు మాత్రం, తాను నూటికి నూరుశాతం కళాకారుడినని స్పష్టం చేస్తాడు. దేశంలో లౌకివాదం మీద పెరుగుతున్న చర్చ నేపథ్యంలో అందరూ సమానమేనని చెప్పడానికి నవాజుద్దీన్ తనదైన శైలిలో ఇలా ఒక ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నవాజ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మున్నా మైఖేల్, మంటో, మామ్, బాబుమొషాయ్ బందూక్‌బాజ్ సినిమాల్లో అతడు నటిస్తున్నాడు.

 

Advertisement
 
Advertisement