‘కబీర్ సింగ్‌ను ద్వేషించడమే.. నాకు గొప్ప’

Huge Compliment For Me If People Disliked Kabir Singh - Sakshi

ముంబై : నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర చేయడం ఒకలాంటి ఉత్సాహాన్నిస్తుందని బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అన్నాడు. అతడు నటించిన తాజా చిత్రం ‘కబీర్‌ సింగ్‌’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అర్జున్‌రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు చేసి..షాహిద్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. అయితే మహిళలపై హింసను ప్రేరేపించేదిగా ఉందంటూ ఈ సినిమా ఆది నుంచీ విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షాహిద్‌ కపూర్‌ స్పందిస్తూ.. ‘కబీర్‌ సింగ్‌గా నటించడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిజ జీవితంలో అతడిలా ఉండటం అస్సలు కుదరదు. అయితే అదొక చాలెంజింగ్‌ రోల్‌. ఒక వ్యక్తి భావోద్వేగాలను కచ్చితంగా తెరకెక్కించడం కష్టంతో కూడుకున్న పని. కానీ తెలుగు అర్జున్‌ రెడ్డిలో ఇది సాధ్యమైంది. అందుకే హిందీ రీమెక్‌లో కూడా సహజత్వం ఉండాలని డైరెక్టర్‌కి చెప్పాను’ అని పేర్కొన్నాడు. 

ఇక తన గత సినిమాల గురించి షాహిద్‌ మాట్లాడుతూ... ప్రేక్షకులు ఇష్టపడని పాత్రలు చేయడానికి తానెప్పుడు భయపడలేదని చెప్పాడు.‘ ఉడ్తా పంజాబ్‌లో మత్తుకు బానిసైన టామీ సింగ్‌ అనే కుర్రాడి పాత్రలో నటించినపుడు క్యారెక్టర్‌ కాకుండా నటనను మెచ్చుకుంటూ థియేటర్‌ బయటికి వెళ్లాలని భావించాను. ఒక నటుడిగా సాహసమైన పాత్రలను ఎంచుకోవడం ముఖ్యం. అప్పుడే ప్రేక్షకుల మన్నన పొందామా లేదా అన్న విషయం తెలుస్తుంది. ప్రేక్షకులు తెరపైన పాత్రను చూసి  అశ్చర్యపోవాలి.. ఏంటి ఇంతలా జీవించేశాడు అనుకునేలా క్యారెక్టర్‌ ఉండాలి. నిజానికి కబీర్ సింగ్‌ను ప్రేక్షకులు ఇష్టపడటం లేదంటే అదే నాకు పెద్ద ప్రశంస’ అని చెప్పుకొచ్చాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top