మీకు మీరే ప్రేరణ అవ్వండి | Heroin and Producer Charmi Kaur Interview about International Womens Day | Sakshi
Sakshi News home page

మీకు మీరే ప్రేరణ అవ్వండి

Mar 8 2020 3:48 AM | Updated on Mar 8 2020 6:59 AM

Heroin and Producer Charmi Kaur Interview about International Womens Day - Sakshi

చార్మి

13 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ఎంటరై ఓ 13 ఏళ్లు నటిగా వెనక్కి తిరిగి చూసుకోనంత బిజీగా సినిమాలు చేశారు చార్మి. ‘నీ తోడు కావాలి’ (2002) నుంచి ‘జ్యోతిలక్ష్మి’ (2015) వరకూ కథనాయికగా, ప్రత్యేక పాటల్లో, అతిథి పాత్రల్లో చార్మి మెరిశారు. ‘జ్యోతిలక్ష్మి’తో నిర్మాతగా మారారు. ‘పూరి కనెక్ట్స్‌’ బేనర్‌లో వచ్చిన జ్యోతిలక్ష్మి రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ‘రొమాంటిక్‌’ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్‌ దేవరకొండతో ప్యాన్‌ ఇండియా మూవీ ‘ఫైటర్‌’కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా చార్మితో జరిపిన ఇంటర్వ్యూ.

► స్క్రీన్‌ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ నిర్మాణ రంగంలో తక్కువమంది ఉన్నారు. మీరు యాక్టర్‌ నుంచి ప్రొడ్యూసర్‌ అయ్యారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
తెరవెనకతో పోల్చితే తెర మీద కనిపించే స్త్రీల సంఖ్య ఎక్కువే. కానీ యాక్టింగ్‌ అనేది సాధారణ విషయం కాదు. ఎంతో అంకితభావం, ఇష్టం ఉండాలి. దాంతోపాటు ఎంతో త్యాగం కూడా ఉంటుంది. అప్పుడే ఇండస్ట్రీలో ఉండగలుగుతాం. నా యాక్టింగ్‌ కెరీర్‌లో నేను చాలా ఎత్తుకి ఎదిగాను, అవార్డులు తీసుకున్నాను. కానీ ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.

ఆ సినిమాలో నటిస్తూ, నిర్మించాను. ఒకవైపు ప్రొడక్షన్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటూ, ఎవరిని ఎలా డీల్‌ చేయాలో అర్థం చేసుకుంటూ మరోవైపు నటనని కూడా బ్యాలెన్స్‌ చేసుకునేదాన్ని. అయితే యాక్టింగ్‌ కంటే ప్రొడక్షన్‌ చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఒక మంచి సినిమా ఇవ్వడానికి నిర్మాత పడే కష్టాలు తెలిశాయి. ఒక స్త్రీగా నిర్మాణం సవాల్‌ అయినప్పటికీ సంతృప్తినిస్తోంది. అందుకే ప్రొడక్షన్‌ని కెరీర్‌గా చేసుకుని తెరవెనక పని చేస్తున్నాను. దేశంలో మనకున్న అతి తక్కువమంది సక్సెస్‌ఫుల్‌ యంగ్‌ లేడీ ప్రొడ్యూసర్స్‌లో నేను ఒకదాన్ని కావడం ఆనందంగా, గర్వంగా ఉంది.

► డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌గారు సపోర్ట్‌ చేయడంవల్లే మీరు ప్రొడక్షన్‌ చూసుకోగలుగుతున్నారా? లేక మీ అంతట మీరు సొంతంగా ప్రొడక్షన్‌ని హ్యాండిల్‌ చేసే ధైర్యం మీకుందా?
పూరీగారు, నేను ఒకర్నొకరం సపోర్ట్‌ చేసు కుంటాం. మా మంచీ చెడులకు మేం ఒకరికొకరం అండగా నిలబడ్డాం. ఇక నేను ఓన్‌గా ప్రొడక్షన్‌ చూసుకోగలనా అంటే.. ‘జ్యోతిలక్ష్మి’ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో తీస్తున్న సినిమాతో కలిపి ఐదేళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నాను. మరి నాకు ఓన్‌గా ప్రొడక్షన్‌ని హ్యాండిల్‌ చేసేంత ధైర్యం ఉందో లేదో చెప్పండి (నవ్వుతూ).

► మేల్, ఫిమేల్‌ ప్రొడ్యూసర్‌కి ఉన్న డిఫరెన్స్‌?
జెండర్‌ తేడా తప్ప పని విషయంలో ఏ తేడా ఉండదు. పీపుల్‌ని డీల్‌ చేసే విషయంలోను, సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేసే విషయంలోనూ అంతా ఒకటే. అయితే పెద్ద తేడా ఏంటంటే.. ఆడవాళ్లను నిరుత్సాహపరచడానికి చాలామంది ట్రై చేస్తారు. ఈ బిజినెస్‌కి పనికి రావు అన్నట్లుగా డౌన్‌ చేస్తారు. అలాంటి సమయాల్లో స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటివాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. కేవలం వాళ్లకున్న అభద్రతాభావంవల్లే స్త్రీలను నిరుత్సాహపరచడానికి ట్రై చేస్తారు.

► హీరోయిన్‌గా ఎదుర్కొన్న సవాళ్లు? ఇప్పుడు నిర్మాతగా ఎదుర్కొంటున్న వాటి గురించి?
నా పదమూడేళ్ల వయసులో యాక్టింగ్‌ కెరీర్‌ని మొదలుపెట్టాను. అప్పటినుంచి నటిగా నా చివరి సినిమా ‘జ్యోతిలక్ష్మి’ వరకు కెరీర్‌ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ చాలా ఎత్తుపల్లాలు చూశాను. తట్టుకుని ముందుకెళ్లాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ప్రతిభే మనల్ని శిఖరానికి చేర్చుతుంది. నటిగా నన్ను ప్రూవ్‌ చేసుకున్నాక అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిర్మాతగా కెరీర్‌ మొదలుపెట్టాక చాలామంది ‘నెగటివ్‌ అడ్వైస్‌’లు ఇచ్చారు. ప్రొడక్షన్‌ బ్యాగ్రౌండ్‌ లేని కుటుంబం నుంచి వచ్చాను. పైగా ఫిమేల్‌ ప్రొడ్యూసర్‌. అయితే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఫైనల్లీ ప్యాన్‌ ఇండియా మూవీ (‘ఫైటర్‌’) ప్రొడ్యూసర్‌గా బెస్ట్‌ స్పేస్‌లో ఉన్నాను.

► నటన, నిర్మాణం ఏది సౌకర్యంగా ఉంది?
మీరు ఒక పని చేస్తున్నప్పుడు నేను ‘కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను’ అనే ఫీలింగ్‌ వస్తే అక్కడితో లైఫ్‌ చివరి దశకు చేరుకున్నట్లే. ఎందుకంటే కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. జీవితం అంటేనే సాహసం. అది కంఫర్ట్‌గా ఉండేకన్నా చాలెంజింగ్‌గా ఉంటేనే బాగుంటుంది.

► ఫైనల్లీ.. నటిగా ఇండస్ట్రీని చూశారు. ఇప్పుడు నిర్మాతగా చూస్తున్నారు. ఈ రెండింటిలో స్త్రీకి ఏది సేఫ్‌?
ఏది సేఫ్‌ అని అడుగుతున్నారంటేనే స్త్రీకి ఎక్కడైనా కష్టాలు ఉన్నట్లే. ముఖ్యంగా మన సమాజంలో స్త్రీలకు ఏదో ఒక అసౌకర్య పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. నటన, నిర్మాణం అనేది పక్కన పెడదాం. ప్రతి ఫీల్డ్‌లోనూ స్త్రీలకు సవాళ్లు, కష్టాలు ఉంటాయి. వాటికి భయపడిపోకూడదు. ‘స్ట్రాంగ్‌గా ఉండండి. మీకు మీరే ప్రేరణ అవ్వండి’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement