
ఆ సినిమాలు చేయాలంటే నేనింకా ఎదగాలి!
‘మా చిన్న ఖుష్బూ..’ అంటూ తమిళ ప్రేక్షకులు హన్సికను ముద్దుగా పిలుచుకుంటారు.
‘మా చిన్న ఖుష్బూ..’ అంటూ తమిళ ప్రేక్షకులు హన్సికను ముద్దుగా పిలుచుకుంటారు. తమిళ పరిశ్రమలో బొద్దుగుమ్మలకు క్రేజ్ ఉంటుందని చెప్పడానికి నాటి తరంలో ఖుష్బూ.. నేటి తరంలో హన్సిక ఉదాహరణలు. అప్పట్లో ఖుష్బూ వెండితెరను ఏలినట్లే ఇప్పుడు హన్సిక కూడా తమిళ తెరపై దూసుకెళుతున్నారు. ఈ బబ్లీ బ్యూటీ కమర్షియల్ చిత్రాలకే పరిమితమయ్యారు. కొంతమంది కథానాయికలు చేస్తున్నట్లు మీకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని లేదా? అనే ప్రశ్న హన్సిక ముందుంచితే – ‘‘అలాంటి సినిమాలు చేయాలని ఉంది. కాకపోతే నా వయసింకా ఐదేళ్లే కదా.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే నేనింకా ఎదగాలి. ఇంకా బోల్డంత అనుభవం సంపాదించుకున్నాక ఆ సినిమాలు చేస్తా. ఇప్పుడు నాకు ‘కమర్షియల్ హీరోయిన్’ అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని నేనిష్టపడుతున్నా’’ అన్నారు. అవునూ.. ‘నా వయసింకా ఐదేళ్లే’ అని హన్సిక అనడం ఆశ్చర్యంగా ఉంది కదూ! మరేం లేదు.. తమిళ పరిశ్రమలోకి ఆమె కథానాయికగా ఎంటరై, ఐదేళ్లవుతోంది. ఆ విషయాన్నే హన్సిక ఇలా చెప్పారు.