
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయి. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా సోహెల్కు రెండో పెళ్లి కావడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరో టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హన్సిక కొట్టిపారేసింది.
ఈ సంగతి అటుంచితే గతంలో హన్సికతో ఆమె తల్లి జ్యోతిలపై సోదరుడి భార్య ముస్కాన్ గృహ హింస కేసు పెట్టారు. తనను వేధింపులకు గురి చేశారని బుల్లితెర నటి ముస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే హన్సిక, ఆమె తల్లికి ముంబయి సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ కేసును క్వాష్ చేయాలంటూ హన్సిక బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా హన్సిక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. హన్సిక దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ కేసులో నిరాశే ఎదురైంది. కాగా.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్ జేమ్స్‌ను 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ ఫిర్యాదు చేసింది.