లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సుమన్ ఆటలో అవుట్ అయ్యాడు. అతడి దగ్గరున్న రూ.1 లక్షలో సగం, తన స్కోర్‌లో సగం ఎవరికైనా పంచొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. ఆయనకు వెంటనే భరణి పేరు తట్టింది.. కానీ, భరణి మాత్రం సంజనాకు ఇవ్వమని సలహా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (డిసెంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
భరణిని సైడ్ చేశారు
అలా సుమన్ ఇచ్చిన పాయింట్ల దెబ్బకు సంజనా లీడర్ బోర్డులో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక తర్వాత గేమ్‌లో మెజారిటీ ఇంటిసభ్యులు కలిసి భరణిని పక్కనపెట్టి గేమ్ ఆడారు. అలా జోకర్ గేమ్‌లో ఇమ్మూ, సంజనా గెలవగా మిగతావాళ్లు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయారు. లీడర్ బోర్డులో చివర్లో ఉన్న పవన్.. తన దగ్గరున్న రూ.1,50,000 అలాగే 150 పాయింట్లలో సగం ఒకరికి ఇచ్చి ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు బిగ్‌బాస్.
మళ్లీ భరణి టార్గెట్
అతడు తన పాయింట్స్ అన్నీ తనూజకు ఇవ్వడంతో ఆమె లీడర్ బోర్డులో టాప్‌లో నిలిచింది. ఇక నెక్స్ట్ గేమ్‌లో ఒకర్ని తీసేయాలని బిగ్‌బాస్ చెప్పగానే మెజారిటీ ఇంటిసభ్యులు మళ్లీ భరణిని తీసేశారు. మిగిలిన సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్ బ్యాలెన్స్ గేమ్ ఆడారు. ఈ ఆటలో ఇమ్మూ గెలవగా తనూజ, సంజనా తర్వాతి స్థానాల్లో వచ్చారు.
ఓట్ అప్పీల్
అయితే లీడర్ బోర్డులో మాత్రం తనూజ ఫస్ట్ ర్యాంక్‌లో ఉండగా.. ఇమ్మూ సెకండ్, సంజనా మూడో స్థానంలో ఉన్నారు. దీంతో బిగ్‌బాస్ ఓట్ అప్పీల్ కోసం తనూజతో పాటు ఇంకెవరు ముందుకు రావాలనే నిర్ణయాన్ని తనూజ చేతిలో పెట్టాడు. అలా తనూజ.. సంజనాను ఎంచుకుంది. వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది.
మీ ఏడుపు ఫేక్
తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీ ఏడుపు నిజమనిపించదు, ఫేక్ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్‌గా ఉండదు అని చెప్పింది. భరణి నాన్న.. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక భరణి సర్ ఎందుకయ్యారు? అన్న ప్రశ్నకు తనూజ.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది.
సింపతీ
కాకపోతే మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే నాన్న అనే పిలుపును పక్కనపెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్‌ను ముఖం మీదే ఫ్రెండ్ కాదని ఎలా అంటావని నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్ చేయలేదా? అని రివర్స్‌లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్? మీరే అందరి సపోర్ట్ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది.


