చైతూ సినిమాకు రిలీజ్ కష్టాలు | Sakshi
Sakshi News home page

చైతూ సినిమాకు రిలీజ్ కష్టాలు

Published Tue, Jun 21 2016 9:07 AM

చైతూ సినిమాకు రిలీజ్ కష్టాలు - Sakshi

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న అక్కినేని నాగచైతన్య మూవీ సాహసం శ్వాసగా సాగిపో. చైతూకి ఏం మాయ చేశావే లాంటి బిగ్ హిట్ అందించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. అయితే తమిళంలో హీరోగా నటిస్తున్న శింబు కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది.

ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ అక్కినేని హీరోకి కష్టాలు తీరేలా లేవు. అదే నెలలో రెండు భారీ చిత్రాల రిలీజ్ ఉండటంతో రిలీజ్కు సరైన డేట్ కోసం ఆలోచనలో పడ్డారు. ముందుగా సినిమాను జూలై మొదటివారంలో రిలీజ్ చేయాలని భావించినా, అదే సమయంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ అవుతుండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

రజనీ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులో, ఓవర్సీస్లో కూడా భారీ ఎఫెక్ట్ ఉంటుందని సాహసం శ్వాసగా సాగిపో సినిమాను జూలై నెలాఖరున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కాని అదే సమయంలో చైతూ మామయ్య వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం రిలీజ్కు రెడీ అవుతోంది. దీంతో మరోసారి నాగచైతన్య సినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement