
కుమార్తెకు హీరో బహిరంగ లేఖ
బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. తన కూతురుకు జాగ్రత్తలు చెబుతూ బహిరంగ లేఖ రాశారు.
దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు, అరాచకాల పట్ల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా నటీనటులు పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. తన కుమార్తెకు జాగ్రత్తలు చెబుతూ ఆమె పేరు ప్రస్తావించకుండా బహిరంగ లేఖ రాశారు. అభద్రత ప్రపంచంలో జీవిస్తున్నాంటూ, మహిళలపై జరుగుతున్న దాడులను ఆయన లేఖలో ప్రస్తావించారు.
ప్రియమైన కుమార్తెకు,
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల గురించి ఏలా రాయగలను? తండ్రిగా నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. సమాజంలో జరుగుతున్న దాడుల గురించి మనం కచ్చితంగా చర్చించుకోవాలి. నీవు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా టీమ్లోని ఓ లాయర్ను కిరాతకంగా చంపారు. ఈ చర్య నన్ను తీవ్రంగా కలచివేసింది. నీకు ఇప్పుడు 16 ఏళ్లు. నా మదిలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలను నీతో పంచుకుంటున్నాను. మనం ఎలాంటి సమాజంలో నివసిస్తున్నాం? ఎలాంటి భయంలేకుండా మహిళలపై లైంగికదాడులు చేస్తున్నారు. ప్రేమించే హక్కును లాక్కుంటున్నారు. మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు. సమాజంలో మార్పు రావాలి. కీచకుల నుంచి ఎదురయ్యే సమస్యలను మనం చర్చించుకోవాలి. ఓ తండ్రిగా చెబుతున్నా.. ఎవరి నుంచైనా ఇబ్బంది కలిగినా, అసభ్యంగా ప్రవర్తించినా మౌనంగా ఉండరాదు. ఇలాంటివి నీకు నచ్చవని ధైర్యంగా చెప్పు.
మనం సురక్షితంగా కాని, సమానత్వంలేని ప్రపంచంలో జీవిస్తున్నాం. స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో బతకాలి. సమాజంలో జరుగుతున్న దారుణాలను సినిమాల్లో కూడా చూపిస్తున్నాం. సినిమాల్లో గతంలో విలన్ చేసే చెడు పనులను ఇప్పుడు హీరోలతో చేయిస్తున్నారు. సినిమాల్లో నీకు నచ్చేవి, నచ్చనవి నాతో చర్చిస్తుంటావు. మంచి, చెడు విషయాల గురించి మనం చర్చించుకోవాలి. నీవు బయటకు వెళ్లినపుడు ఓ తండ్రిగా నాకు ఆందోళన ఉంటుంది. నీవు క్షేమంగా ఉండాలని అందరి తండ్రుల మాదిరే నేను ఆలోచిస్తా. నీవు నా స్నేహితురాలు. నువ్వు స్వతంత్రంగా జీవించాలి. నీ కలలను సాకారం చేసుకోవాలి. ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. సౌమ్యంగా, స్వీయ నియంత్రణలో ఉండాలి. ఈ సమాజం ఎలా ఉందో ఎప్పుడూ గుర్తించుకో. నీవు చిన్న పిల్లవని తెలుసు. ఈ దశలో ఏది మంచిదనే విషయంలో గందరగోళం ఉంటుంది. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటా.
యువర్స్,
డాడ్