
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులు- సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మధ్య ఘర్షణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఎడతెగని టీవీచర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో సినీ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. ఈ నెల 15వరకు వేచిచూడాలని, అప్పటివరకు ఇటు కత్తి మహేశ్.. అటు పవన్ అభిమానులు మౌనంగా ఉండాలని కోన సూచించారు. దీంతో ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి తెరవెనుక సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు అప్పట్లో భావించారు. కానీ, జనవరి 15వ తేదీ వెళ్లిపోయింది. ఇటు వివాదమూ సమసిపోయినట్టు కనిపించడం లేదు.
ఇందుకు నిదర్శనం కత్తి మహేశ్ ట్వీట్.. కోన వెంకట్‌ను ఉద్దేశించి ‘ఎక్కడ ఉన్నారు సార్? నేను మౌనంగా ఉన్నా.. పవన్ కల్యాణ్, అతని అభిమానుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నా నుంచి నా కుటుంబానికి ఈ దాడులు విస్తరించాయి. నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కోన ఘాటుగా స్పందించారు. ‘దురదృష్టవశాత్తు ఈ నెల 7న ట్వీట్ పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే అంశం మీద కొన్ని టీవీ చానళ్ల డిబేట్‌లో పాల్గొన్నావు. పీకే, అతని అభిమానుల మీద దాడి చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలను కలిశావు. మౌనం అంటే నీ నిఘంటువులో వేరే అర్థం ఉందా’ అని ప్రశ్నించారు. దీనినిబట్టి పవన్ అభిమానులు, కత్తి మహేశ్ మధ్య గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు తెరవెనుక ఎలాంటి రాజీ ప్రయత్నాలు జరగలేదా? కేవలం పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదల సందర్భంగా రభస లేకుండా తాత్కాలికంగా వాయిదా వేసేందుకే కోన ఈ ట్వీట్ చేశారా? ఇకముందు కూడా ఈ వివాదం కొనసాగబోతుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Unfortunately, after my tweet on 7th, u continued ur debates on the same issue in few channels and also involved some student organisations in attacking PK & his fans.. Does “SILENCE” has different meaning in ur dictionary?? https://t.co/wXETH2BpbM
— kona venkat (@konavenkat99) January 17, 2018