‘రాహు’కి కథే హీరో

Director Subbu Vedula Talk About Raahu Movie - Sakshi

‘‘రాహు’ సినిమాలో కథానాయికకు ఓ వ్యాధి ఉంటుంది. రక్తం చూసినప్పుడు కళ్లు కనిపించవు.. ఒత్తిడికి గురవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ప్రవేశిస్తే ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా చూపించాం’’ అన్నారు సుబ్బు వేదుల. అభిరామ్‌ వర్మ, కృతీ గార్గ్‌ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఎస్‌ఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా సుబ్బు వేదుల చెప్పిన విశేషాలు.

నాది వైజాగ్‌. న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఫిల్మ్‌ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలోనే రచయిత కోన వెంకట్‌గారితో నాకు పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కొన్ని కథలకు కలిసి పనిచేశాం. ఆయన బ్యానర్‌లో ‘గీతాంజలి 2’ సినిమా నేను చేయాల్సి ఉంది.. కొన్ని కారణాల వల్ల మా కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కాలేదు.. కానీ, ఆయన నాకు మంచి సహకారం అందించారు. 

‘రాహు’సినిమాకి కథే హీరో. దాదాపు ఏడాది పాటు ఈ కథపై పనిచేశా. చిత్ర నిర్మాతలు కథ వినగానే సినిమా చేద్దామన్నారు. నా కథపైన నమ్మకంతో నేను కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాను. మా నిర్మాతల సహకారం మరువలేనిది. 52 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాం. 

థ్రిల్లర్‌ జోనర్‌లో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా థ్రిల్‌ని అందించడంతో పాటు తాజా అనుభూతి ఇస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం, నేపథ్య సంగీతం హైలైట్‌. నేను, నా కూతురు ఈ సినిమాలో నటించాం. ‘మధుర’ శ్రీధర్‌గారు మాకు మంచి సహకారం అందించారు. సురేష్‌ బాబుగారు మా సినిమాను విడుదల చేయడం, జీ చానల్‌ వాళ్లు డిజిటల్‌ రైట్స్‌ తీసుకోవడం విడుదలకు ముందే మేం సాధించిన విజయాలు.

డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటిగారి సినిమాలంటే ఇష్టం. ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రం నా ఫేవరెట్‌. ఇళయరాజాగారి సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన కథానాయకుడు అల్లు అర్జున్‌.. ఆయన నటన సూపర్బ్‌.

పెద్ద స్టార్ట్స్‌తో సినిమా చెయ్యాలంటే నన్ను నేను నిరూపించుకోవాలి. ‘రాహు’ తర్వాత స్టార్‌ హీరోలను సంప్రదిస్తా. ఒక స్టార్‌ హీరో కోసం ‘మృగం’ అనే సినిమా స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top