ఆ ఒక్కదానికే తలవంచిన ‘దర్శక’ శిఖరం | Dasari narayanarao career in film industry | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కదానికే తలవంచిన దాసరి..

May 30 2017 7:20 PM | Updated on Sep 5 2017 12:22 PM

దాసరి... ఓ దార్శనికుడు. నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న శ్రామికుడు.



దాసరి... ఓ దార్శనికుడు. నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న శ్రామికుడు. సమాజంలో సమస్యలపై సినిమాల ద్వారా బాణాలు సంధించిన సైనికుడు. మాటలతో మనకు మంచి బోధించిన మార్గదర్శకుడు. ఎందరో (ఏకలవ్య) శిష్యులు, దర్శకులకు గురువుగా నిలిచిన నిలువెత్తు శిఖరం. ప్రతిభావంతులు ఎందరికో నీడ ఇచ్చిన ‘దర్శక’ శిఖరం. దాసరి ప్రయాణం నవతరం దర్శకులకు పాఠం.

ఆయన దర్శకుడు మాత్రమే కాదు మాటల రచయిత, పాటల రచయిత కూడా. 150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి సుమారు 250 చిత్రాలకు మాటలు, అనేక సినిమాల్లో పాటలు రాశారు. దాసరి ప్రతిభ అంత వరకేనా? కాదండోయ్‌! ఆయన నటుడు, నిర్మాత కూడా. తెలుగుకు మాత్రమే దాసరి పరిమితం కాలేదు. హిందీలోనూ దర్శకునిగా సత్తా చాటారు. తమిళ, కన్నడ సినిమాల్లో నటునిగా మెరిశారు. దాసరిది ఘనచరిత్ర... ప్రతిభకు చేయూత ఇచ్చిన చరిత.

శిఖరం దేనికీ తలొంచి ఎరగదు. కానీ ‘దర్శక’ శిఖరం దాసరి  ఒక్కదాని ముందు ఎప్పుడూ తలొంచారు. దర్శకునిగా ప్రయాణం ప్రారంభించినప్పట్నుంచి ఆ ఒక్కదాని ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ ఒక్కటి... కథ, సినిమా కథ. తాను రాసిన కథ ఎవర్ని కోరితే వాళ్లతోనే సినిమాలు తీసిన దర్శకుడు దాసరి నారాయణరావు. తొలి సినిమా ‘తాతా మనవడు’ నుంచి మొదలుపెడితే తాజా ‘ఎర్ర బస్సు’ వరకు ఆయన దారి మార్చుకోలేదు. రెండు తరాల అగ్ర నటులతో, హీరోలతో పని చేశారాయన. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణలతో పాటు తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో సినిమాలు తీశారు. స్టార్‌ దర్శకునిగా పేరొచ్చిన తర్వాత కొత్త నటీనటులతో, తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమాలు తీయడానికి వెనుకాడలేదు. కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు.

తొలి సినిమా ‘తాతా మనవడు’లో ‘అనుబంధం అత్మీయత అంతా ఓ బూటకం’ అంటూ కన్నకొడుకు నిరాదరణకు గురైన తల్లిదండ్రల ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారు. స్వర్గం–నరకం, మేఘ సందేశం, కంటే కూతుర్నే కను వంటి సినిమాల్లో ప్రేక్షకుల హృదయపు లోతుల్లో తడిని తట్టి లేపారు. దాసరి ఫ్యామిలీ సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ‘తాండ్ర పాపారాయుడు‘, ‘బొబ్బిలి పులి‘, ‘సర్దార్‌ పాపారాయుడు‘ వంటి కమర్షియల్‌ సినిమాలతో గర్జించారు. ‘ప్రేమాభిషేకం‘, ‘మజ్ను‘ సినిమాల్లో ప్రేమను ప్రేక్షకులకు చూపారు. ‘ఒసేయ్‌ రాములమ్మ’లో సమాజంలో అసమానతలను ఎత్తి చూపారు. ఈ సినిమాలు దాసరి తీసిన ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’ ఇలా ఎన్నో ఎన్నెన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారాయన. ఆయన ప్రతిభకు మెచ్చి పలు అవార్డులు సలాం చేశాయి. రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను దాసరి అందుకున్నారు.


నేపథ్యం: ‘దర్శకరత్న’ దాసరి 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. బి.ఎ. చదివారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల పోటీల్లో పాల్గొన్నారు. బహుమతులు గెలుచుకున్నారు. అత్యధిక చిత్రాల దర్శకునిగా దాసరి లిమ్కా వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. మేఘ సందేశం (1983), తాండ్ర పాపారాయుడు (1986), సూరిగాడు (1992), కంటే కూతుర్నే కను (2000) వంటి చిత్రాలు దర్శకుడిగా దాసరికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఆశాజ్యోతి’, ‘ఆజ్‌ కా ఎమ్మెల్యే’, ‘రామ్‌ అవతార్‌’ చిత్రాలలో రాజేశ్‌ ఖన్నాను దాసరి విలక్షణమైన భిన్న పాత్రల్లో చూపించారు.

నటులు మోహన్‌బాబు, ఆర్‌.నారాయణమూర్తి, దర్శకులు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి ఇంకా పలువురు సాంకేతిక నిపుణుల్ని దాసరే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

రాజకీయాలు: దాసరి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ’సాక్షి’ ఎక్సలెన్సీ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది దర్శకరత్న దాసరికి ‘తెలుగు శిఖరం’అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో దాసరి మంగళవారం సాయంత్రం కిమ్స్‌ ఆస‍్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి ’సాక్షి’  సంతాపం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement